epaper
Thursday, January 22, 2026
spot_img
epaper

‘తెలంగాణ ఫస్ట్..’ నినాదం వెనుక.. మర్మమేమిటి?

కలం, తెలంగాణ బ్యూరో: తన తండ్రి మరిచిపోయిన మూలాల్లోకి కవిత (Kavitha) వెళ్తున్నారా? మరుగునపడిన ఉద్యమం నాటి ఆకాంక్షలే ఎజెండాగా ఆమె వ్యూహాలు రచిస్తున్నారా? తెలంగాణ అస్తిత్వమే జెండాగా త్వరలో కొత్త పార్టీ పురుడు పోసుకోనుందా?! ‘‘తెలంగాణ ఫస్ట్.. ఇదే మా పాలసీ, ఇదే మా నినాదం’’ అంటూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు చేసిన కామెంట్ల వెనుక మర్మమేమిటి?! రాజకీయ శక్తిగా ఎదిగేందుకు ఆమె దగ్గర ఉన్న ట్రంప్ కార్డు ఏమిటి?! ఇప్పుడు రాజకీయాల్లో ఇదే హాట్ టాపిక్.

అమెరికాలో ట్రంప్, కేంద్రంలో మోదీ.. తెలంగాణలో..?!

‘అమెరికా ఫస్ట్’ అంటూ డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) యూఎస్ ఎన్నికల బరిలో దిగి రెండోసారి విజయం సాధించారు. కేంద్రంలో మోదీ (Narendra Modi) సర్కార్ వరుసగా మూడుసార్లు కొలువుదీరడం వెనుక ‘ఇండియా ఫస్ట్’ అనే స్లోగనే దాగి ఉంది. ‘’నేషన్ ఫస్ట్.. పార్టీ నెక్స్ట్.. సెల్ఫ్ లాస్ట్ ‘’ అనేది బీజేపీ నినాదం. అటు కేంద్రంలోనైనా, ఇటు చాలా రాష్ట్రాల్లోనైనా కమలం జెండా ఎగరడంలో ఇదే కీలక పాత్ర పోషించింది. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ కూడా ‘తెలంగాణ ఫస్ట్ ’ అనే స్లోగన్ తోనే ముందుకు వెళ్లారు. ఇప్పుడు కవిత కూడా అదే బాటలో అడుగులు వేస్తున్నారు. ‘‘మాకు తెలంగాణ ఫస్ట్ (Telangana First).. తెలంగాణ ప్రాధాన్యతల కోసమే పనిచేస్తం. తెలంగాణ మంచి కోసం పనిచేసేవాళ్లు ఎక్కడ ఉన్నా ఏ పార్టీలో ఉన్నా వారి గురించి మాట్లాడుకుంటాం. తెలంగాణ జాగృతి తప్పకుండా ఒక రోజు అధికారంలోకి వస్తుంది” అంటూ బుధవారం తెలంగాణ ఉద్యమకారుడు ముచ్చర్ల సత్యనారాయణ జయంతి సందర్భంగా కవిత (Kavitha) వ్యాఖ్యానించారు.

టీఆర్ఎస్ పేరు మార్చడం నచ్చలేదనీ..!

బీఆర్ఎస్ (BRS) నుంచి అన్ని బంధాలు తెంచుకొని బయటకు వచ్చిన కవిత.. ఆ మధ్య కౌన్సిల్ వేదికగా తన ఆవేదన వెలిబుచ్చారు. ‘‘ఇక్కడ ఏం పీకి కట్టలు కట్టామనీ.. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చారు. తెలంగాణలో చేయాల్సింది ఎంతో ఉంది. అవన్నీ వదిలేసి దేశ రాజకీయాల్లోకి వెళ్లడమేంది? బీఆర్ఎస్ గా పేరు మార్చినప్పుడు ఆ మీటింగ్ కు నేను అటెండ్ కాలే. నాకే కాదు తెలంగాణలో ఎంతో మంది ఉద్యమకారులకు కూడా పేరు మార్చుడు నచ్చలేదు” అని అన్నారు. సామాజిక తెలంగాణ సాధనే లక్ష్యంగా తాము రాజకీయ శక్తిగా ఎదుగుతామని చెప్పారు. ఆ దిశగా చర్చలు కూడా జరుపుతున్నారు. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను మననం చేసుకుంటూ.. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో విస్మరణకు గురైన అంశాలను బయటకు తీస్తూ ఆమె ప్రత్యేక ఎజెండా రెడీ చేస్తున్నట్లు తెలిసింది.

ప్రాంతీయ పార్టీ అవసరాన్ని గుర్తించి..!

అమరుల కుటుంబాలు, ఉద్యమకారులు, మేధావులు, సింగరేణి కార్మికులు.. ఇలా అన్ని వర్గాలను వరుసబెట్టి కవిత కలుస్తున్నారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను చాటేందుకు స్థాపించిన తెలంగాణ జాగృతి టీమ్ ను మరింత యాక్టివ్ చేశారు. తెలంగాణ కళలను కాపాడేందుకు, మరుగునపడ్డ అంశాలను వెలుగులోకి తెచ్చేందుకు ఆ టీమ్ లోని కొందరికి ప్రత్యేక టాస్క్ అప్పజెప్పినట్లు తెలుస్తున్నది. ట్యాంక్ బండ్ పై ముచ్చర్ల సత్యనారాయణ వంటి తెలంగాణ తేజోమూర్తుల విగ్రహాలు ఉండాలన్న డిమాండ్ ను మరింత బలంగా వినిపించేందుకు కవిత సిద్ధమయ్యారు. సత్యన్న లాంటి ఎందరో ఉద్యమకారులకు గత ప్రభుత్వం అన్యాయం చేసిందని ఆమె ఇప్పటికే తీవ్ర విమర్శలు చేశారు. తాము అధికారంలోకి వస్తే శ్రీకాంతాచారి వంటి అమరుల జయంతి, వర్ధంతులను అధికారికంగా జరుపుతామని.. తెలంగాణ అస్తిత్వానికి సెంటర్ పాయింట్ గా అమరజ్యోతిని తీర్చిదిద్దుతామని చెప్పారు.

తెలంగాణలో ఉద్యమంలో ఎంతో మంది అన్ సంగ్ హీరోలు ఉన్నారని, వారి చరిత్ర కూడా భవిష్యత్ తరాలకు తెలిసేలా ప్రయత్నం చేస్తామని తెలిపిన కవిత.. ఆ దిశగా తన టీమ్ ను ప్రిపేర్ చేస్తున్నారు. తెలంగాణ అస్తిత్వమే ప్రధాన జెండా, ఎజెండాగా కవిత దళం వ్యూహాలు రచిస్తున్నది. టీఆర్ ఎస్ ను బీఆర్ ఎస్ గా కేసీఆర్ (KCR) మార్చిన తర్వాత.. తెలంగాణలో బలమైన ప్రాంతీయ పార్టీ అవసరం ఎంతైనా ఉందని మేధావులు వాదించారు. ఇప్పటికీ అదే చెప్తున్నారు. వారి ఆలోచనలకు తగ్గట్టుగా ‘తెలంగాణ ఫస్ట్’ నినాదంతో ప్రాంతీయ పార్టీ ఏర్పాటు దిశగా కవిత (Kavitha) టీమ్ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తున్నది.

Read Also: ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ కు షాక్ ఇచ్చిన సిట్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>