కలం, వెబ్‌డెస్క్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) తన కేబినెట్ మంత్రులపైనే కుట్రలు చేస్తున్నారని, దోచుకున్న సొమ్ములో వాటా అడిగినందుకే వారిని టార్గెట్ చేస్తున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి (Jagadish Reddy) ఆరోపించారు. ముఖ్యంగా 1600 కోట్ల రూపాయల నైని కోల్ బ్లాక్ గనుల టెండర్ల రద్దు కోసమే ఈ తరహా ఆరోపణలు, కథనాలు వస్తున్నాయని ఆయన విమర్శించారు. ఈ మొత్తం వ్యవహారంపై ఏసీబీతో విచారణ జరిపించాలని ఆయన డీజీపీని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన దోచుకో, దాచుకో, పంచుకో అన్నట్లుగా సాగుతోందని ఎద్దేవా చేశారు.
మీడియా సమావేశంలో జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. మహిళా ఐఏఎస్ (Woman IAS) అధికారి ఆత్మహత్యాయత్నం చేసుకున్నారంటూ ఏ ఆధారాలతో కథనాలు రాశారని ఏబీఎన్ రాధాకృష్ణను జగదీష్ రెడ్డి ప్రశ్నించారు. ఈ అంశంపై ఐఏఎస్ అధికారుల సంఘం, జయేష్ రంజన్ వెంటనే స్పందించి ఫిర్యాదు చేయాలని, సిట్ ద్వారా విచారణ జరపాలని కోరారు. రేవంత్ రెడ్డి తీరు ‘టు మోదీ వయా చంద్రబాబు’ అన్నట్లుగా ఉందని, ఖమ్మం సభలో టీడీపీ జెండాలు కనిపించడంతో ఆయన బాగోతం బయటపడిందని విమర్శించారు. నాడు అహంకారంతో మాట్లాడిన చంద్రబాబును ప్రజలు పాతాళానికి పాతరేశారని, రేవంత్ రెడ్డికి కూడా అంతకంటే అధ్వాన్నమైన గతి పడుతుందని హెచ్చరించారు.
అధికారుల తీరుపై కూడా జగదీష్ రెడ్డి (Jagadish Reddy) మండిపడ్డారు. పేర్లు లేని కథనాలపై ఉరుకులు పరుగులు పెట్టి స్పందిస్తున్న డీజీపీ, ప్రతిపక్ష నాయకులైన కేటీఆర్, హరీష్ రావులపై అనుచిత రాతలు వచ్చినప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారని నిలదీశారు. గాంధీ భవన్ నుంచి నడిచే ఘోస్ట్ వెబ్‌సైట్లపై తాము ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. అధికారులకు ఒక నీతి, నాయకులకు మరో నీతి ఉంటుందా అని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు పెంచి పోషించిన కలుపు మొక్కలైన స్లాటర్ హౌస్ రాజకీయాలు తెలంగాణలో సాగవని ఆయన స్పష్టం చేశారు.
Read Also: మహిళా కానిస్టేబుల్ పై సజ్జనార్ ప్రశంసలు
Follow Us On : WhatsApp


