కలం, వెబ్ డెస్క్ : వికలాంగుల జీవన భద్రత, సామాజిక గౌరవం, ఆర్థిక స్వావలంబన లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వికలాంగుల వివాహ (Disabled Marriage) ప్రోత్సాహక నగదును రూ.1 లక్ష నుంచి రూ.2 లక్షలకు పెంచుతూ.. ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ.. వికలాంగుల జీవితాల్లో భద్రత, స్థిరత్వం తీసుకురావడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. గత ప్రభుత్వాల కాలంలో వికలాంగులకు కేవలం పరిమిత సహాయం మాత్రమే అందిందని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వికలాంగుల సమస్యలను మానవీయ కోణంలో పరిశీలించి నిర్ణయాలు తీసుకుంటోందని తెలిపారు.
వికలాంగుల మధ్య వివాహాల (Disabled Marriage)ను ప్రోత్సహించడం ద్వారా సామాజిక అంగీకారం పెరిగి.. వివక్ష తగ్గుతుందని, అలాగే కుటుంబ వ్యవస్థ బలోపేతం అవుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా వికలాంగుల ఆత్మవిశ్వాసం పెరిగి, సమాజంలో సమాన హక్కులతో జీవించేందుకు మార్గం సుగమమవుతుందని వెల్లడించారు. వికలాంగులకు పింఛన్ల పెంపు, సంక్షేమ పథకాల విస్తరణ, ఆర్థిక సహాయాల పెంపు వంటి చర్యలతో తెలంగాణ ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పేర్కొన్నారు.


