కలం, తెలంగాణ బ్యూరో : ప్రతీ పట్టణ స్థానిక సంస్థల్లో ఒక ట్రాన్స్ జెండర్ పర్సన్‌ను కో-ఆప్షన్ పద్ధతిలో నియమించుకునేలా మున్సిపల్ చట్ట సవరణకు (Municipal Law Amendment) ప్రభుత్వం సిద్ధమవుతున్నది. ఇప్పుడున్న మున్సిపల్ చట్టంలోని సెక్షన్ 5 (ఏ)కు సవరణ చేసి ఈ కొత్త ప్రతిపాదన చేయనున్నది. రాష్ట్రంలోని అన్ని పట్టణ స్థానిక సంస్థల్లో ఒక్కో ట్రాన్స్ జెండర్‌కు ఈ సవరణ ద్వారా ప్రాతినిధ్యం లభించనున్నది. మునిసిపాలిటీలు, మునిసిపల్ కార్పొరేషన్లలో కో-ఆప్షన్ పద్ధతిలో మెంబర్‌గా నియమించడానికి వీలుగా చట్టాన్ని సవరించేందుకు ఒక ఆర్డినెన్సును తీసుకురానున్నది. ప్రస్తుతం అసెంబ్లీ సెషన్ ఉనికిలో లేనందున ఈ ఆర్డినెన్సును తీసుకువచ్చేలా మున్సిపల్ శాఖలో కసరత్తు మొదలైంది. అసెంబ్లీ సమావేశాలు ముగిసినా గవర్నర్ ప్రోరోగ్ చేయకపోవడంతో ఈ ఆర్డినెన్సు తీసుకురావడానికి ముందే గవర్నర్ ఆమోదంతో లోక్‌భవన్ నుంచి ప్రోరోగ్ ఉత్తర్వులు విడుదల కానున్నట్లు సమాచారం.
మేడారం క్యాబినెట్ భేటీలో చర్చ :
ప్రతీ మునిసిపల్ బాడీలో ఒక ట్రాన్స్ జెండర్ పర్సన్‌ను ప్రభుత్వం నియమించాలని నిర్ణయం తీసుకున్నందున ఆర్డినెన్సు గురించి మేడారంలో రేపు (ఆదివారం) సాయంత్రం జరిగే మంత్రివర్గ సమావేశంలో చర్చ జరగనున్నది. ప్రతిపాదిత బిల్లు కాపీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆమోదంతో మునిసిపల్ శాఖ నుంచి వెట్టింగ్ కోసం న్యాయశాఖకు వెళ్లింది. మేడారం క్యాబినెట్ భేటీలో ఈ బిల్లుపై చర్చించిన తర్వాత నిర్ణయం జరగనున్నది. ఆ తర్వాత గవర్నర్ ఆమోదంతో గెజిట్ నోటిఫికేషన్ విడుదల కానుంది. దీంతో ఆ నిర్ణయం వెంటనే అమలులోకి వస్తుంది. బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఈ ఆర్డినెన్సు స్థానంలో ప్రభుత్వం బిల్లును ప్రవేశపెట్టి అన్ని పార్టీల సభ్యులు చర్చల్లో పాల్గొన్న అనంతరం చట్టంగా రూపొందనున్నది.
Read Also: మేడారం ట్రస్టు బోర్డు చైర్ పర్సన్ గా సుకన్య ప్రమాణ స్వీకారం
Follow Us On: X(Twitter)


