కలం వెబ్ డెస్క్ : డబ్ల్యూపీఎల్-4 (WPL) సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) దూకుడు కొనసాగిస్తోంది. వరుస మూడు మ్యాచుల్లో గెలుపు సాధించి ఆర్‌సీబీ సీజన్‌లో హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసింది. బ్యాటింగ్, బౌలింగ్ రెండింట్లోనూ చాలా బ్యాలెన్స్‌డ్‌గా ఉంది. ప్రతి మ్యాచ్‌లో ఆధిపత్యం చూపిస్తోంది. స్టార్టింగ్ మ్యాచ్‌ల నుంచే ఆర్‌సీబీ ఆత్మవిశ్వాసంతో ఆడుతోంది. కీలక సమయంలో బాధ్యత తీసుకునే బ్యాటర్లు, మ్యాచ్‌ను తమ వైపుకు తిప్పే బౌలర్లు జట్టుకు పెద్ద బలం చేకూర్చారు. రాధ యాదవ్, రిచా ఘోష్ లాంటి ఆటగాళ్లు ఒత్తిడిలోనూ నిలబడి సమయానికి పరుగులు రాబడుతున్నారు. చివరి ఓవర్లలో నదైన్ డిక్లెర్క్ లాంటి ఆల్‌రౌండర్లు జట్టుకు అదనపు శక్తిని అందిస్తున్నారు.
బౌలింగ్‌లో శ్రేయాంక పాటిల్ (Shreyanka Patil) ఆర్‌సీబీ అసలైన ఆయుధంగా మారింది. మధ్య ఓవర్లలో వికెట్లు తీస్తూ ప్రత్యర్థి జట్టును ఒత్తిడిలోకి నెట్టడం, లారెన్ బెల్ పేస్‌తో కీలక బ్రేక్ ఇవ్వడం చూస్తే, గేమ్ పూర్తి నియంత్రణలో ఉంది. ఫీల్డింగ్‌లోనూ జట్టు చురుకుగా ఉండి అదనపు పరుగులు ఇవ్వడం లేదు. వరుస మూడు విజయాలతో ఆర్‌సీబీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. జట్టు సమతూకం, ఆత్మవిశ్వాసం చూస్తే ఈ సీజన్‌లో ఆర్‌సీబీని అడ్డుకోవడం ఏ జట్టుకైనా సవాలు. ఫ్యాన్స్ ఊహించని ప్రదర్శనతో జట్టు మరింత బలవంతమవుతోంది.
గుజరాత్‌కు చుక్కలు
నవీ ముంబయిలోని డీవై పాటిల్ స్టేడియంలో గుజరాత్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 32 పరుగుల తేడాతో గెలిచి వరుసగా మూడో విజయాన్ని అందుకుంది. ఈ ఫలితంతో స్మృతి మంధాన (Smriti Mandhana) జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ ఆరంభంలోనే నాలుగు కీలక వికెట్లు కోల్పోయి ఒత్తిడిలో పడింది. ఈ సమయంలో రాధ యాదవ్ బాధ్యత తీసుకుని ఇన్నింగ్స్‌ను నిలబెట్టింది. 47 బంతుల్లో 66 పరుగులతో ఆమె జట్టుకు బలం చేకూర్చింది. రిచా ఘోష్ 28 బంతుల్లో 44 పరుగులతో దూకుడు చూపింది. చివర్లో నదైన్ డిక్లెర్క్ 12 బంతుల్లో 26 పరుగులు చేసి స్కోరును 182కు చేర్చింది.
183 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ జట్టును ఆర్సీబీ (RCB) బౌలర్లు కట్టడి చేశారు. యువ స్పిన్నర్ శ్రేయాంక పాటిల్ అద్భుతంగా బౌలింగ్ చేసి 23 పరుగులకే ఐదు వికెట్లు తీసింది. లారెన్ బెల్ మూడు వికెట్లతో రాణించింది. భారతి పుల్మాలి 39 పరుగులతో కాస్త పోరాడినా, గుజరాత్ 18.5 ఓవర్లలో 150 పరుగులకే కుప్పకూలింది.
Read Also: టీ20 స్క్వాడ్ నుంచి సుందర్ ఔట్.. అయ్యర్, బిష్ణోయ్‌కి ఛాన్స్
Follow Us On: Youtube


