కలం, వెబ్‌డెస్క్: ‘తప్పు చేసినవాళ్లు ఏనాటికైనా శిక్ష నుంచి తప్పించుకోలేరు’ అనే విషయం మరోసారి నిజమైంది. అందుకే 85 ఏళ్ల వయసులో ఆ వృద్ధుడికి మూడేళ్ల జైలు శిక్ష పడింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. సురేశ్ చంద్ర రాథ్ (85) ఒడిశాలోని పూరీ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీస్‌లో అసిస్టెంట్ కన్జర్వేటివ్ ఆఫ్ ఫారెస్ట్స్(ఏసీఎఫ్)గా పనిచేసి రిటైరయ్యారు (Retired Forest Officer). ఈయన 1969లో ఫారెస్ట్ ఆఫీసర్‌గా ఉద్యోగ జీవితం ప్రారంభించారు. 1999లో రిటైరయ్యారు. అయితే, సురేశ్ చంద్రపై 30 ఏళ్ల కిందట.. అంటే 1996లో అక్రమాస్తుల కేసు నమోదైంది. విజిలెన్స్ తనిఖీల్లో అతని వద్ద రూ.11లక్షలకుపైనే పట్టుబడింది. అప్పట్లో ఇది భారీ మొత్తం. ఆ కేసు దర్యాప్తు అలా కొనసాగుతూ వచ్చింది.
విజిలెన్స్ అధికారులు పట్టువదలని విక్రమార్కుల్లా సాక్షాధారాలు సేకరించారు. ఈ క్రమంలో సురేశ్ చంద్ర (Suresh Chandra Rath) పదవీ విరమణ (Retired Forest Officer) కూడా పూర్తయ్యింది. చివరికి అన్ని ఆధారాలను భువనేశ్వర్‌లోని స్పెషల్ విజిలెన్స్ కోర్టుకు అధికారులు సమర్పించారు. వీటిని పరిశీలించిన న్యాయమూర్తి హిమాన్షు శేఖర్ మల్లిక్ శుక్రవారం తీర్పు వెల్లడించారు. సురేశ్ చంద్ర రాథ్‌కు మూడేళ్ల కఠిన కారాగార శిక్షతోపాటు రూ.లక్ష జరిమానా విధించారు. ఆ విధంగా అక్రమాస్తుల కేసులో ముప్పై ఏళ్ల తర్వాత శిక్ష పడింది.‘ కృష్ణా , రామా’ అనుకుంటూ కాలం గడపాల్సిన వయస్సులో శిక్ష పడడం అవినీతి పరులకు, అక్రమార్కులకు ఓ హెచ్చరిక లాంటిదే.
Read Also: బెట్టింగ్, గ్యాంబ్లింగ్ యాప్‌లపై కేంద్రం ఉక్కుపాదం
Follow Us On: Instagram


