కలం, నల్లగొండ : విదేశాల్లో ఉన్నత చదువులు చదివిస్తానని, అక్కడే ఉద్యోగాలు ఇప్పిస్తానని నిరుద్యోగ యువతను నమ్మించి భారీగా డబ్బులు వసూలు చేసి మోసం (Foreign Jobs Scam) చేస్తున్న అంతర్ రాష్ట్ర నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ల్యాప్‌ట్యాప్, పలు డెబిట్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. ఏపీలోని గుంటూరు జిల్లా తాటికొండ మండలం బంగారు పల్లి గ్రామానికి చెందిన ముప్పాళ్ళ లీల కృష్ణ జిల్లాలో నిరుద్యోగులకు విదేశాల్లో ఉన్నత చదువులు, ఉద్యోగాలు ఇప్పిస్తానని ఆశ చూపి మోసానికి పాల్పడ్డాడు. ఈ ఘటన చింతపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది.
నల్గొండ జిల్లా అడిషనల్ ఎస్పీ రమేశ్(Additional SP Ramesh) శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో యువతను మోసం చేసిన (Foreign Jobs Scam) వివరాలను వెల్లడించారు. పోలేపల్లి రాంనగర్‌కు చెందిన కోయల కార్ కరుణభాయ్ కుమారుడిని విదేశాలకు పంపించి ఉన్నత చదువులు చదివించి ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి లీల కృష్ణ డబ్బులు తీసుకొని మోసం చేశాడు. దీనిపై కరుణబాయ్ ఫిర్యాదు మేరకు చింతపల్లి పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ముప్పాళ్ల లీలా కృష్ణ ను అదుపులోకి తీసుకొని విచారించగా, నల్లగొండ, వరంగల్ జిల్లాల్లో పలువురు విద్యార్థుల నుండి భారీ మొత్తంలో డబ్బులు తీసుకొని ఇదే తరహా మోసాలకు పాల్పడినట్లు తేలింది.
విదేశాలకు వెళ్లాలనుకున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులను నమ్మించి ఇప్పటివరకు మొత్తం 8 మంది నుండి సుమారు రూ.85 లక్షల వరకు తీసుకొని మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు. మాల్ గ్రామం – మర్రిగూడ రోడ్డులో అనుమానాస్పదంగా సంచరిస్తున్న నిందితుడిని గుర్తించిన చింతపల్లి పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని విచారించారు. నిందితుడిపై ఇప్పటికే మాడుగులపల్లి పోలీస్ స్టేషన్ వరంగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చీటింగ్ కేసులు ఉన్నట్లు తెలిపారు. ఈ కేసులో నేరస్థుడిని పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించి ప్రతిభ కనబర్చిన నాంపల్లి సీఐ డి.రాజు, చింతపల్లి ఎస్‌ఐ ఎం.రామ్మూర్తి, పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించి రివార్డులు ప్రకటించినట్ ఏఎస్పీ రమేశ్ తెలిపారు.
Read Also: ధరణి, భూభారతి కుంభకోణంలో 15మంది అరెస్ట్.. భారీగా నగదు స్వాధీనం
Follow Us On: Sharechat


