కలం, వెబ్ డెస్క్: అక్రమ ఆన్‌లైన్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్ యాప్‌లు, వెబ్‌సైట్లపై (Illegal Betting Websites) కేంద్ర ప్రభుత్వం మరోసారి ఉక్కుపాదం మోపింది. తాజాగా 242 అక్రమ బెట్టింగ్, గ్యాంబ్లింగ్ వెబ్‌సైట్ లింకులను బ్లాక్ చేసినట్లు ప్రభుత్వ వర్గాలను ఉటంకిస్తూ ఏఎన్‌ఐ నివేదించింది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 7,800కు పైగా ఇలాంటి అక్రమ వెబ్‌సైట్లను నిలిపివేసినట్లు అధికారులు వెల్లడించారు. ఆన్‌లైన్ గేమింగ్ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత ఈ చర్యలు మరింత వేగం పుంజుకున్నాయని తెలిపారు. చట్టబద్ధ అనుమతులు లేకుండా కార్యకలాపాలు నిర్వహించే, భారత చట్టాలను ఉల్లంఘించే ఆన్‌లైన్ గేమింగ్, బెట్టింగ్ ప్లాట్‌ఫామ్‌లపై తక్షణమే చర్యలు తీసుకునే అధికారం అమలు సంస్థలకు లభించిందని పేర్కొన్నారు.
అక్రమ బెట్టింగ్, గ్యాంబ్లింగ్ వెబ్‌సైట్లతో (Illegal Betting Websites) యువత తీవ్రంగా నష్టపోతున్నారని .. కొందరు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని కేంద్రం ఆందోళన వ్యక్తం చేస్తోంది. యువత ఆర్థికంగా దెబ్బతినకుండా, డిజిటల్ వేదికలు సురక్షితంగా ఉండేలా ఈ చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేసింది. 2022 నుంచి ఇప్పటివరకు ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ 1,400కు పైగా అక్రమ బెట్టింగ్, గ్యాంబ్లింగ్ వెబ్‌సైట్లు, యాప్‌లను బ్లాక్ చేయాలని ఆదేశించినట్లు సమాచారం. ఇదే క్రమంలో తాజాగా పార్లమెంట్‌లో ఆమోదం పొందిన ‘ప్రొమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్‌లైన్ గేమింగ్ బిల్–2025’కు రాష్ట్రపతి ఆమోదం లభించిన తర్వాత నియంత్రణ మరింత కఠినంగా మారనుందని అధికారులు తెలిపారు. అక్రమ ఆన్‌లైన్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్‌పై ఈ దాడులు కొనసాగుతాయని, భవిష్యత్తులో మరిన్ని అక్రమ ప్లాట్‌ఫామ్‌లను గుర్తించి బ్లాక్ చేస్తామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.


