మెగా జాబ్ మేళాలో 99 మందికి కొలువులు

కలం, కరీంనగర్ : ప్రైవేట్ రంగంలో యువతకు అందుబాటులో ఉన్న ఉపాధి అవకాశాలను గుర్తించి, వాటిని అందిపుచ్చుకోవాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా (Chitra Mishra) నిరుద్యోగ యువతకు సూచించారు. ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు జాబ్ మేళాలు(Mega Job Fair) మంచి అవకాశాలని, జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో నిర్వహించే ఈ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. హెల్త్, ఆటోమొబైల్, ఐటీ, ఫార్మా తదితర రంగాల వారీగా ప్రత్యేక జాబ్ మేళాలు నిర్వహించేలా ప్రణాళిక రూపొందించాలని ఉపాధి కల్పన అధికారులను ఆదేశించారు.

నిరుద్యోగ యువతకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో జిల్లా ఉపాధి కల్పన శాఖ, టాస్క్ (TASK) సంయుక్త ఆధ్వర్యంలో శనివారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన మెగా జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ వివిధ కంపెనీల ప్రతినిధులు నిర్వహించిన ఇంటర్వ్యూలు, అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను పరిశీలించారు.

17 కంపెనీలు.. 294 మంది అభ్యర్థులు

ఈ జాబ్ మేళాలో ప్రముఖ ఐటీ, నాన్ ఐటీ, ఫార్మా తదితర రంగాలకు చెందిన 17 కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా 294 మంది నిరుద్యోగ యువతీ యువకులు హాజరై ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. కంపెనీల ప్రతినిధులు అభ్యర్థుల విద్యార్హతలు, నైపుణ్యాలు, అనుభవాన్ని పరిశీలించి ఎంపిక ప్రక్రియ నిర్వహించారు.

99 మందికి అక్కడికక్కడే ఆఫర్ లెటర్లు

జాబ్ మేళాలో మొత్తం 143 మంది అభ్యర్థులు తదుపరి ఎంపికకు షార్ట్‌లిస్ట్ కాగా, వారిలో 99 మందికి స్పాట్ ఆఫర్ లెటర్లు అందజేశారు. మరో 32 మంది ప్రాథమికంగా అర్హత సాధించారు. ఉద్యోగావకాశాలు దక్కించుకున్న అభ్యర్థులను కలెక్టర్ అభినందించి, నూతన ఉద్యోగ జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.

అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక మేళాలు

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు జిల్లా యంత్రాంగం నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. పరిశ్రమలు, ప్రైవేట్ సంస్థల అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలు పెంపొందించుకుంటే ఉద్యోగ అవకాశాలు మరింత మెరుగవుతాయని పేర్కొన్నారు. ఒక్కో రంగానికి ప్రత్యేకంగా జాబ్ మేళాలు నిర్వహించడం ద్వారా ఆయా రంగాల్లో ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులకు మెరుగైన అవకాశాలు కల్పించవచ్చన్నారు. భవిష్యత్తులో మరిన్ని జాబ్ మేళాలు నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో డీఆర్ఓ స్వామి, జిల్లా ఉపాధి కల్పన అధికారి తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>