కలం, యాదాద్రి భువనగిరి : ఒకవైపు రహదారి ప్రమాదాలు.. మరోవైపు యువతను పట్టిపీడిస్తున్న మాదక ద్రవ్యాల ముప్పు.. ఈ రెండు సమస్యలపై యాదాద్రి భువనగిరి జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. ప్రమాదాలకు నిలయాలుగా మారిన బ్లాక్ స్పాట్లను గుర్తించి తక్షణ నివారణ చర్యలు చేపట్టడంతో పాటు, డ్రగ్స్ వినియోగం, అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు సమన్వయంతో కార్యాచరణ రూపొందించాలని జిల్లా కలెక్టర్ (Yadadri Collector) అనురాగ్ జయంతి అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ మినీ మీటింగ్ హాల్లో జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అధ్యక్షతన రోడ్డు భద్రతా కమిటీ, యాంటీ నార్కోటిక్స్ సమావేశాలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఆకాంక్ష్ యాదవ్‌తో కలిసి వివిధ శాఖల అధికారులతో జిల్లాలోని కీలక సమస్యలపై సమీక్షించారు.
ప్రమాదాలకు అడ్డాగా మారిన బ్లాక్ స్పాట్లపై ప్రత్యేక దృష్టి!
జిల్లాలో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలు, వాటికి దారితీస్తున్న కారణాలపై కలెక్టర్ సమీక్షించారు. జాతీయ రహదారులు, ప్రధాన రహదారులు కలిసే ప్రాంతాల్లో ప్రమాదాల నివారణకు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రమాదకర మలుపులు, కూడళ్ల వద్ద హెచ్చరిక బోర్డులు, బ్లింకర్లు, తెల్ల రంబుల్ స్ట్రిప్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. బ్లాక్ స్పాట్లుగా గుర్తించిన ప్రాంతాల్లో కేవలం గుర్తింపుకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో తక్షణ చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. ప్రమాదం జరిగినప్పుడు దాని వెనుక ఉన్న కారణాలను పూర్తిస్థాయిలో విశ్లేషించి, భవిష్యత్తులో అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
యువతే టార్గెట్‌గా డ్రగ్స్ మాఫియా?
మాదక ద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణా అంశంపైనా కలెక్టర్ ప్రత్యేకంగా సమీక్షించారు. జిల్లాలో నమోదైన కొత్త కేసులు, పట్టుబడిన మాదక ద్రవ్యాల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా కంపెనీలపై ప్రత్యేక నిఘా పెట్టాలని సూచించారు. కళాశాలలు, గ్రామాలు, పట్టణాల్లో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించి యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. డ్రగ్స్ వినియోగం, సరఫరా వ్యవస్థపై సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు.
కుటుంబాలకే కాదు.. సమాజానికీ ముప్పు!
మాదక ద్రవ్యాల వినియోగం వల్ల బాధితుల కుటుంబాలతో పాటు మొత్తం సమాజం కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉందని జిల్లా ఎస్పీ ఆకాంక్ష్ యాదవ్ పేర్కొన్నారు. యువత చెడు వ్యసనాలకు ఆకర్షితులు కాకుండా నిరంతరం అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.
అధికారుల సమన్వయమే కీలకం!
రోడ్డు భద్రత, మాదక ద్రవ్యాల నియంత్రణ ఒక్క శాఖ బాధ్యతలు మాత్రమే కావని, అన్ని శాఖలు సమష్టిగా పనిచేసినప్పుడే ఆశించిన ఫలితాలు సాధ్యమవుతాయని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రమాద రహిత జిల్లాగా తీర్చిదిద్దడంతో పాటు డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి అధికారులు అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఆర్ అండ్ బి అధికారి సునీల్ కుమార్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ తుక్యా నాయక్, డీఈఓ బిక్షపతి, జిల్లా రవాణా అధికారి నరేష్, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్ రెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు.

