కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలంలోని బూర్గూడెం వద్ద శనివారం జరిగిన రైలు ప్రమాదంలో (Train Accident) మహిళ మృతి చెందారు. మేకలు మేపేందుకు వెళ్లిన ఆమె రైల్వే ట్రాక్ దాటుతుండగా ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. అన్నపురెడ్డిపల్లి మండలం బూర్గూడెం గ్రామానికి చెందిన బాల్ద కృష్ణవేణి (32) శనివారం మేకలను మేపేందుకు సమీపంలోని పొలాలకు వెళ్లారు. మేత అనంతరం మేకలను రైల్వే ట్రాక్ అవతలికి పంపిన ఆమె, తాను కూడా ట్రాక్ దాటేందుకు ప్రయత్నించారు. అదే సమయంలో అటుగా వచ్చిన రైలు ఆమెను అకస్మాత్తుగా ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో కృష్ణవేణికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనను గమనించిన స్థానికులు వెంటనే స్పందించి 108 అంబులెన్స్ ద్వారా ఆమెను కొత్తగూడెం ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె ప్రాణాలు కోల్పోయారు. కృష్ణవేణి మృతితో బూర్గూడెం గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. కాగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

