కొప్పుల వ్యాఖ్యలకు ధర్మపురి కాంగ్రెస్ నేతల కౌంటర్

కలం, ధర్మపురి: రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌పై మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ (Koppula Eshwar) చేసిన వ్యాఖ్యలను మండల కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా ఖండించారు. ధర్మపురి (Dharmapuri) ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు చిలుముల లక్ష్మణ్, పార్టీ ఉపాధ్యక్షుడు వేముల రాజేష్ మాట్లాడారు.

చిలుముల లక్ష్మణ్ మాట్లాడుతూ.. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌ను ఉద్దేశించి కొప్పుల ఈశ్వర్ అవహేళనగా మాట్లాడటం ఆయన అహంకార ధోరణికి నిదర్శనమని విమర్శించారు. 20 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేశానని, లక్ష్మణ్ కుమార్ చెబితే తాము వినాలా అని మాట్లాడటం సరికాదన్నారు. అధికారం కోల్పోయిన తర్వాత ప్రజా సమస్యలను పట్టించుకోకుండా వ్యక్తిగత విమర్శలకు దిగడం తగదని, ధర్మపురి నియోజకవర్గానికి గతంలో చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు పరిస్థితిపై కూడా సమాధానం చెప్పాలన్నారు. ఓటమి తర్వాత కూడా అడ్లూరి ప్రజలకు దూరం కాకుండా వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.

కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు వేముల రాజేష్ మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయ అభివృద్ధికి ఆశించిన స్థాయిలో నిధులు కేటాయించలేదని విమర్శించారు. ప్రస్తుతం మంత్రి అడ్లూరి చొరవతో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చేతుల మీదుగా ఆలయ పునర్నిర్మాణ పనులకు భూమిపూజ చేసి పనులు ప్రారంభించామని తెలిపారు. గతంలో మూతపడిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి సంస్కృత ఆంధ్ర కళాశాలను తిరిగి ప్రారంభించిన ఘనత కూడా మంత్రికే దక్కుతుందన్నారు.

ధర్మపురిలో తాగునీటి సమస్య పరిష్కారానికి బోరు పంపులు, ట్యాంకర్ల ద్వారా చర్యలు తీసుకుంటున్నామని, సుమారు రూ.22 కోట్ల అమృత్ పథకం నిధులతో శాశ్వత తాగునీటి పనులు ప్రారంభమయ్యాయని వివరించారు. అనారోగ్యంతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారికి సీఎం రిలీఫ్ ఫండ్ (CMRF), ఎల్ఓసీ నిధులు త్వరితగతిన మంజూరు చేయిస్తున్నామని తెలిపారు. నియోజకవర్గానికి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు చేసి పనులు ప్రారంభించామని, డిగ్రీ కళాశాల తరగతులు కూడా మొదలయ్యాయని చెప్పారు. మంత్రి చొరవతో ధర్మపురికి బస్ డిపో మంజూరుకు హామీ పొందామని వెల్లడించారు.

కొప్పుల ఈశ్వర్ వ్యక్తిగత విమర్శలకు దిగకుండా ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని, ఆలయ అభివృద్ధి, ఆధ్యాత్మిక కార్యక్రమాలను అడ్డుకునే ప్రయత్నాలు మానుకోవాలని కాంగ్రెస్ నేతలు సూచించారు. అభివృద్ధి పనులతోనే ప్రతిపక్షాలకు సమాధానం చెబుతామని, అయితే మంత్రిపై వ్యక్తిగత దూషణలను సహించబోమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, వివిధ గ్రామాల సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>