డీలిమిటేషన్‌పై సమరశంఖం.. ‘జైల్ భరో’కు సీపీఐ పిలుపు!

కలం, ఖమ్మం బ్యూరో: కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు (Kunamneni Sambasiva Rao) ఆరోపించారు. శనివారం పాల్వంచలోని ‘సీఆర్ భవన్’లో జరిగిన సీపీఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.

జనాభా నియంత్రణను సమర్థవంతంగా అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాలకు ప్రోత్సాహం ఇవ్వాల్సింది పోయి, సీట్ల తగ్గింపు పేరుతో శిక్షించడం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని కూనంనేని (Kunamneni Sambasiva Rao) అన్నారు. కేవలం ఉత్తరాది రాష్ట్రాల్లో సీట్లను పెంచుకుని, దొడ్డిదారిన మళ్లీ గద్దెనెక్కేందుకే బీజేపీ ఈ కుట్రకు తెరలేపిందని విమర్శించారు. దేశ సమగ్రతను దెబ్బతీసే ఈ ఏకపక్ష డీలిమిటేషన్ ప్రక్రియను దక్షిణాది ప్రజలంతా ఐక్యంగా అడ్డుకోవాలని పిలుపునిచ్చారు.

​ఎన్నికల సంఘం ప్రత్యేక సవరణ (సర్) ప్రక్రియ ద్వారా దేశవ్యాప్తంగా సుమారు 13 కోట్లకు పైగా అర్హులైన ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించడం ప్రజాస్వామ్యంపై జరిగిన దాడి అని ఆయన ధ్వజమెత్తారు. బీజేపీకి అనుకూలంగా ఓటర్ల జాబితాలను తారుమారు చేసే ఈ ప్రక్రియను తక్షణమే నిలిపివేసి, పాత పద్ధతిలో బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ​దేశంలో పెరుగుతున్న నిత్యావసర ధరలు, రాజ్యాంగం, ప్రజాస్వామ్యంపై జరుగుతున్న దాడులకు నిరసనగా ‘మార్పు అవసరం’ (బద్లావ్ జరూరీ హై) నినాదంతో డిసెంబర్ 1, 2, 3 తేదీల్లో దేశవ్యాప్త జైల్ భరో ఆందోళనను విజయవంతం చేయాలని కోరారు. క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ గ్రామస్థాయి నుంచి సీపీఐని మరింత బలోపేతం చేయాలని, భవిష్యత్ ఉద్యమాలకు కార్యకర్తలు సిద్ధం కావాలని దిశానిర్దేశం చేశారు.

​​ఉప్పుశెట్టి రాహుల్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ముత్యాల విశ్వనాథం, కల్లూరి వెంకటేశ్వర్లు, జిల్లా కార్యవర్గ సభ్యులు సరిరెడ్డి పుల్లారెడ్డి, నరాటి ప్రసాద్, ఎస్‌డీ సలీం, కె. సారయ్య, సలిగంటి శ్రీనివాస్, ఉదయ్ భాస్కర్, మున్నా లక్ష్మీకుమారి, మూడ్ గణేష్, కంచర్ల జమలయ్య, రేసు ఎల్లయ్య, వీసంశెట్టి పూర్ణచంద్రరావు, జి. వీరస్వామి, భూక్య దాసురు, కందుల భాస్కర్, ఎస్‌కె ఫహీం తదితరులు పాల్గొన్నారు.

Also Read : గీతా ఆర్ట్స్‌కు జ‌క్క‌న్న స‌ల‌హా.. యంగ్ ప్రొడ్యూసర్స్‌కు కౌంట‌ర్‌!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>