కలం, వెబ్ డెస్క్ : కొడంగల్ నియోజకవర్గం దుద్యాల మండలం హకీంపేటలో అసైన్డ్ భూముల పేరుతో భారీ అక్రమాలు జరిగాయని బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ (RS Praveen Kumar) సంచలన ఆరోపణలు చేశారు. వాస్తవంగా 300 ఎకరాలు మాత్రమే ఉండగా, రికార్డుల్లో 500 ఎకరాలుగా చూపించి దాదాపు రూ.60 కోట్ల భూ కుంభకోణానికి పాల్పడ్డారని ఆయన విమర్శించారు.
సీఎం రేవంత్ రెడ్డి సహకారంతోనే ఈ భూ అక్రమాలు చోటుచేసుకున్నాయని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ (RS Praveen Kumar) ఆరోపించారు. ఈ వ్యవహారంపై కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు లేవని అన్నారు. డీజీ విజిలెన్స్‌కు ఫిర్యాదు చేసేందుకు వెళ్లినా అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని పేర్కొన్నారు.
హకీంపేట భూ వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. గతంలో లగచర్లలో గిరిజనుల కోసం పోరాడినట్లే, హకీంపేట భూ కుంభకోణంపై కూడా పోరాటం చేస్తామని తెలిపారు. బీఆర్ఎస్ 3.0లో దయాదాక్షిణ్యాలు ఉండవని హెచ్చరించిన ఆయన, కాంగ్రెస్ నాయకులతో కుమ్మక్కై పనిచేస్తున్న పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు పెడుతున్న అక్రమ కేసులు, చేస్తున్న అన్యాయాలు అన్నీ రికార్డు అవుతున్నాయని, భవిష్యత్తులో చట్టపరంగా తప్పకుండా చర్యలు ఉంటాయని అన్నారు. ఎంత బతిమాలినా కనికరం ఉండదని, ఎంజాయ్ చేయడానికి మిగిలింది కేవలం రెండేళ్లు మాత్రమేనని వ్యాఖ్యానించారు.
Also Read : కేటీఆర్ కీలక ప్రకటన.. బీఆర్ఎస్ మద్దతు!
Follow Us On : WhatsApp

