కలం, కరీంనగర్ : తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ చేసిన పోరాటం, బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ ఈ నెల 29న అలుగునూరులో నిర్వహించనున్న దీక్షా దివాస్ (Deeksha Divas) సభను విజయవంతం చేయాలని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ పిలుపునిచ్చారు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం బావుపేట గ్రామంలో జిల్లా మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రెడ్డివేణి మధు ఆధ్వర్యంలో శనివారం గ్రామస్తులతో నిర్వహించిన సన్నాహక సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు.
ఈ సందర్భంగా గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష చరిత్రలో నిలిచిపోతుందన్నారు. తెలంగాణ ఏర్పడక ముందు గ్రామాల్లో కనీస రోడ్డు సౌకర్యాలు కూడా లేని పరిస్థితి ఉండేదని, తాగునీరు, సాగునీటి కోసం ప్రజలు ఇబ్బందులు పడేవారని గుర్తుచేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామాలకు రోడ్డు కనెక్టివిటీ కల్పించడంతో పాటు సాగునీటి వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చిందన్నారు.
కేసీఆర్ పాలనలో రైతుబంధు, రైతుబీమా, నిరంతర విద్యుత్ సరఫరా వంటి పథకాలతో రైతులకు భరోసా కల్పించామని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా సాగునీటి వసతులు మెరుగుపరిచామని, స్థానిక చెరువులను నింపి రైతులకు నీరు అందించామని పేర్కొన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో సాగునీటి సమస్యలు తలెత్తుతున్నాయని, నాగుల మల్యాల తో పాటు బావుపేట, పరిసర గ్రామాల చెరువులను నింపాలని డిమాండ్ చేశారు. రైతుల పంటలు ఎండిపోకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.
కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో గుజరాత్ మోడల్‌ను ప్రస్తావించారని, ప్రస్తుతం తెలంగాణ చరిత్ర, సంస్కృతిని గౌరవించాలని మాట్లాడుతున్నారని పేర్కొంటూ ఆయన వ్యాఖ్యల్లో పరస్పర విరుద్ధత ఉందని విమర్శించారు. హైదరాబాద్‌లో వర్షపు నీరు భూమిలోకి ఇంకకపోవడానికి సంబంధించి గతంలో బావులు, నీటి నిల్వల గురించి చెప్పిన మాటలకు, ప్రస్తుతం నగరం కాంక్రీట్ నిర్మాణాలతో నిండిపోవడం వల్ల నీరు ఇంకడం లేదంటూ చేస్తున్న వ్యాఖ్యలకు పొంతన లేదన్నారు.
రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులు, గోదావరి, కృష్ణా జలాల వినియోగం విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై ఆయన విమర్శలు చేశారు. తెలంగాణకు రావాల్సిన నీటిని సమర్థంగా వినియోగించుకోవడంలో ప్రభుత్వం విఫలమవుతోందని ఆరోపించారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అన్నారు.
తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని, రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని సంజయ్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. దీక్షా దివాస్ సభను బావుపేటతో పాటు కొత్తపల్లి మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.

