నియోజకవర్గాల పునర్విభజనపై టీజేపీ కీలక డిమాండ్!

కలం, కరీంనగర్ బ్యూరో: తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య పెంచాలని టీజేపీ (తెలంగాణ జనతా పార్టీ) రాష్ట్ర అధ్యక్షుడు కుతాడి శివరాజ్ (Kuthadi Shivaraj) ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియలో భాగంగా పార్లమెంట్‌లో మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించిన బిల్లులు నవంబర్ 30వ తేదీన ఆమోదం పొందనున్నాయి. అవి ఆమోదం పొంది అమల్లోకి వస్తే, వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ రిజర్వుడు పార్లమెంట్ & అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్యను పెంచాలని కుతాడి శివరాజ్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.

తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ జనాభా నిష్పత్తి, సామాజిక పరిస్థితులు, రాజకీయ ప్రాతినిధ్యాన్ని దృష్టిలో పెట్టుకొని పార్లమెంట్ స్థానాల్లో ఎస్సీలకు అదనంగా 6 స్థానాలు, ఎస్టీలకు అదనంగా 4 స్థానాలు పెంచాలని ఆయన కోరారు. అదేవిధంగా రాష్ట్ర అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎస్సీలకు 30 స్థానాలు, ఎస్టీలకు 16 స్థానాలు రిజర్వేషన్ కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు జనాభా ప్రాతిపదికన తగిన రాజకీయ ప్రాతినిధ్యం లభించినప్పుడే వారి సమస్యలు చట్టసభల్లో బలంగా వినిపించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. రాజ్యాంగం కల్పించిన సామాజిక న్యాయం, సమానత్వం, రాజకీయ హక్కుల సాధన దిశగా ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవాలని అన్నారు. నియోజకవర్గాల పునర్విభజన సందర్భంగా ఎస్సీ, ఎస్టీ వర్గాల రాజకీయ ప్రాతినిధ్యానికి తగిన ప్రాధాన్యత కల్పించి, వచ్చే ఎన్నికల నాటికి ఈ డిమాండ్ల అమలుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కుతాడి శివరాజ్ కోరారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>