కలం, వెబ్ డెస్క్: రాజమండ్రి కోర్టు ఏర్పాటై నేటితో 222 ఏళ్లు, బార్ అసోసియేషన్ ఏర్పడి 131 ఏళ్లు పూర్తయ్యాయని సీఎం చంద్రబాబు (CM Chandrababu) అన్నారు. రాజమండ్రి చరిత్రలోనే ఈ రోజు గుర్తుండిపోయే రోజుగా అభివర్ణించారు. ఈ మేరకు జరిగిన న్యాయ ఉత్సవంలో సుప్రీం కోర్టు, హై కోర్టు న్యాయమూర్తులతో కలిసి వేడుకల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు కీలక ప్రసంగం చేశారు. రాజమండ్రి బార్ కౌన్సిల్ నుంచి వచ్చినవారు ముఖ్యమంత్రులు అయ్యారని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. ఇదే కోర్టు నుంచి వచ్చిన జస్టిస్ కోకా సుబ్బారావు హై కోర్టు చీఫ్ జస్టిస్, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారని వివరించారు. దేశంలోనే పురాతనమైన కోర్టుల్లో రాజమండ్రి కోర్టు ఒకటన్నారు. యువ లాయర్లు సీనియర్ల నుంచి వీలైనంత ఎక్కువ నేర్చుకోవాలని సూచించారు.
అన్ని సౌకర్యాలు కల్పిస్తాం..
మరో 20 ఏళ్లలో భారత్ సూపర్ పవర్‌గా అభివృద్ధి చెందే అవకాశం ఉందని సీఎం చంద్రబాబు అన్నారు. టెక్నాలజీ ఇప్పుడు పూర్తిగా అందుబాటులోకి వచ్చిందని.. దాన్ని అందిపుచ్చుకునే నాయకత్వం కావాలని పిలుపునిచ్చారు. రాజమండ్రి కోర్టు అభివృద్ధికి కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పిస్తామని ఈ సందర్భంగా బార్ అసోసియేషన్‌కు హామీ ఇచ్చారు. హై కోర్టు చీఫ్ జస్టిస్ తెలుగులో మాట్లాడటం ఎంతో ఆనందం కలిగించిందన్నారు. సుప్రీం కోర్టు జడ్జిలు తెలుగులో పద్యాలు కూడా చెప్పడంపై హర్షం వ్యక్తం చేశారు. బ్రిటీష్ వారి పాలనలో మద్రాస్ ప్రెసిడెన్సీలో భాగంగా ఉన్న రాజమండ్రిలో 1804లో జిల్లా కోర్టు ఏర్పాటైంది. 1895లో బార్ అసోసియేషన్ ఏర్పాటైంది.

