సీఎంఆర్ అక్రమాలపై సైలెంట్.. కేసులు నమోదైనా చర్యలేవీ?

కలం, మహబూబ్ నగర్ బ్యూరో: జోగులాంబ గద్వాల జిల్లాలో కస్టమ్ మిల్లింగ్ రైస్ అక్రమాలపై (CMR Scam) కేసులు నమోదైనప్పటికీ, అధికారులు చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మొత్తం ఐదు మిల్లుల్లో దాదాపు రూ.36.34 కోట్ల విలువైన 13,525 టన్నుల సన్న వడ్లను పక్కదారి పట్టించినట్టు అధికారుల తనిఖీల్లో తేలింది. ఈ ఐదు మిల్లులపై ఐదు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. కానీ కేసులు నమోదై నెలలు గడుస్తున్నా దర్యాప్తు ముందుకుసాగకపోవడం, మిల్లర్లపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో అధికారుల పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

సన్న బియ్యానికి బదులు దొడ్డు బియ్యం..

రాష్ట్ర ప్రభుత్వం సీఎంఆర్ కోసం మిల్లర్లకు సన్న వడ్లను కేటాయించింది. మిల్లర్లు వాటిని మిల్లింగ్ చేసి, ప్రభుత్వానికి సన్న బియ్యం అప్పగించాల్సి ఉంది. అయితే గద్వాల జిల్లాలోని కొందరు మిల్లర్లు సన్న బియ్యం పక్కదారి పట్టించారు. ధాన్యాన్ని మిల్లింగ్ చేయకుండా బహిరంగ మార్కెట్‌లో విక్రయించారు. ప్రభుత్వానికి అప్పగించాల్సిన సన్న బియ్యం స్థానంలో ఇతర ప్రాంతాల నుంచి సేకరించిన దొడ్డు బియ్యాన్ని సరఫరా చేశారు. ఈ అక్రమాలపై ఆరోపణలు రావడంతో అధికారులు రంగంలోకి దిగారు. ఐదు మిల్లులపై కేసులు నమోదు చేశారు.

కేసులు నమోదైన మిల్లులు ఇవే..

  • గద్వాల కొత్తపల్లి రోడ్డులోని ఎంఎస్‌ ఫరీదా రైస్‌మిల్లులో 1,195.80 టన్నుల ధాన్యం కొరత ఉన్నట్టు అధికారులు గుర్తించారు. దీనిపై గద్వాల పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. ధాన్యం విలువ రూ.2.85 కోట్లుగా పేర్కొన్నారు.
  • ఇటిక్యాల మండలం దువాసిపల్లిలోని శ్రీలక్ష్మీ వెంకటేశ్వర మోడ్రన్‌ రైస్‌మిల్లులో 3,615.52 టన్నుల ధాన్యం కొరతకు సంబంధించి కోదండాపురం పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. దీని విలువ రూ.8.63 కోట్లుగా ఉంది.
  • ఉండవెల్లిలోని గోధా శ్రీరంగనాథ పారా బాయిల్డ్‌ రైస్‌మిల్లులో 4,709.07 టన్నుల ధాన్యం కొరత ఉండగా, దీనిపై ఉండవెల్లి పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. ధాన్యం విలువ రూ.13.33 కోట్లుగా అంచనా వేశారు.
  • అలంపూర్‌ బుక్కాపురం రోడ్డులోని ఎంఎస్‌ జోగుళాంబ రైస్‌మిల్లులో 3,425.07 టన్నుల ధాన్యం కొరత ఉన్నట్టు గుర్తించారు. దీనిపై అలంపూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. ధాన్యం విలువ రూ.10.22 కోట్లుగా అధికారులు పేర్కొన్నారు.
  • మొత్తంగా ఐదు మిల్లుల్లో 13,525.276 టన్నుల ధాన్యం కొరత ఏర్పడగా, దాని విలువ సుమారు రూ.36.34 కోట్లుగా అధికారిక రికార్డుల్లో వెల్లడైంది.

చర్యలు శూన్యం..

సీఎంఆర్ అక్రమాలపై కేసులు నమోదైనప్పటికీ, అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. కేసులు నమోదై నెలలు గడుస్తున్నా సంబంధిత మిల్లర్లపై చర్యలు తీసుకోకపోవడం చర్చనీయాంశంగా మారింది. కేసులు నమోదు చేసి చేతులు దులుపుకున్నారా? లేక విచారణ పేరుతో కాలయాపన చేస్తున్నారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇంత భారీ మొత్తంలో ధాన్యం పక్కదారి పట్టినట్టు తేలిన నేపథ్యంలో ఆ ధాన్యం ఎక్కడికి వెళ్లింది? మిల్లర్ల నుంచి ధాన్యం రికవరీ చేశారా? తదుపరి చర్యలు తీసుకున్నారా? లేదా? అనేది ప్రశ్నార్థకంగా మారింది.

అధికారుల పాత్రపై అనుమానాలు..

ప్రభుత్వ ధాన్యం మిల్లులకు చేరినప్పటి నుంచి బియ్యం ఎఫ్‌సీఐకి అప్పగించే వరకు పర్యవేక్షించాల్సిన బాధ్యత అధికారులపైనే ఉన్నది. అలాంటప్పుడు సన్న బియ్యం స్థానంలో దొడ్డు బియ్యం ఎలా సరఫరా అయ్యాయి? నాణ్యత తనిఖీల్లో ఈ తేడాను గుర్తించలేదా? గుర్తించినా పట్టించుకోలేదా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మిల్లర్ల అక్రమాలపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు ఎందుకు మౌనం వహిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>