కలం, ఆదిలాబాద్: బాల్య వివాహాల నిర్మూలనకు ప్రభుత్వ యంత్రాంగంతో పాటు ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు, మహిళా సంఘాలు, ఉపాధ్యాయులు, స్వచ్ఛంద సంస్థలు సమష్టిగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా (Rajarshi Shah) పిలుపునిచ్చారు. బాల్య, ముందస్తు, బలవంతపు వివాహాల నిర్మూలన అంతర్జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం జడ్పీ కార్యాలయ సమావేశ మందిరంలో మహిళా, శిశు సంక్షేమ శాఖ, ఎయిడ్ స్వచ్ఛంద సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ‘బాల్య వివాహ ముక్త్ భారత్ అభియాన్’ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన (Rajarshi Shah) మాట్లాడుతూ.. చిన్న వయస్సులో వివాహాలు చేయడం వల్ల బాలికల శారీరక, మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడటమే కాకుండా, వారి చదువు, వ్యక్తిత్వ వికాసం, స్వతంత్ర నిర్ణయాధికారం దెబ్బతింటాయని తెలిపారు. పేదరికం, ఆర్థిక ఇబ్బందులు, కట్న ఖర్చుల భయం వంటి కారణాలతో కొందరు తల్లిదండ్రులు బాల్య వివాహాల వైపు మొగ్గు చూపుతున్నారని, ఇలాంటి పరిస్థితుల్లో కుటుంబాల ఆలోచనా విధానంలో మార్పు రావాల్సిన అవసరం ఉందన్నారు. బాలికల అభిప్రాయాలకు కుటుంబాల్లో ప్రాధాన్యతనిస్తూ, వారికి ఉన్నత విద్యను అభ్యసించే స్వేచ్ఛ, తమ భవిష్యత్తును నిర్ణయించుకునే అవకాశం కల్పించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి, మహిళ, శిశు సంక్షేమ శాఖ అధికారి మిల్కా, జిల్లా విద్యాశాఖ అధికారి మాధవి, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ సుదర్శన్, సీడబ్ల్యూసీ చైర్మన్ వెంకటస్వామి, నీతి ఆయోగ్ సీఆర్ఏ దేవిశ్రీ, ఎయిడ్ స్వచ్ఛంద సంస్థ సభ్యుడు కె. వినోద్, చైల్డ్ హెల్ప్‌లైన్ కోఆర్డినేటర్ సతీష్, సంక్షేమ శాఖ సిబ్బంది స్వామి, వినోద్, కిరణ్, శంకర్, ప్రసన్న, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

