కలం, వెబ్ డెస్క్: సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర కేబినెట్ (AP Cabinet) సమావేశంలో రాష్ట్రాభివృద్ధిని కాంక్షిస్తూ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సుమారు 3 గంటల పాటు జరిగిన ఈ మంత్రివర్గ సమావేశంలో 30 అంశాలకు ఆమోదం లభించింది. రాష్ట్రంలో ఇండస్ట్రీల ఏర్పాటులో జాప్యం నివారించేలా ‘ఏపీ ఎంఎస్ఎంఈ రైట్ టు బిజినెస్ బిల్లు-2026’కు మంత్రులు ఆమోదం తెలిపారు. ఇటీవల జరిగిన సీఐఐ సదస్సులో ఒప్పందాలు చేసుకున్న 6 సంస్థల పెట్టుబడి ప్రతిపాదనలను ఆమోదించారు. ఈ సంస్థల ద్వారా రూ.36వేల కోట్ల పెట్టుబడులు, వేలమందికి ఉపాధి అవకాశాలు లభించనున్నట్లు తెలిపారు. నాలుగు నెలల పాటు రుషికొండ ప్యాలెస్ ప్రజలు సందర్శించేందుకు మంత్రి వర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
హైకోర్టు, అసెంబ్లీ, సచివాలయానికి నిధులు..
అటు పెనుగొండలో రూ.19వేల కోట్లతో కియా రెండో ఆటోమొబైల్ ప్లాంట్, శ్రీకాకుళంలో అదానీ ఇంటిగ్రేటెడ్ టైటానియం కాంప్లెక్స్ ఏర్పాటును కేబినెట్ ఆమోదించింది. అచ్యుతాపురంలో సెయింట్ గోబైన్ ఫ్లోట్ గ్లాస్ తయారీ పరిశ్రమకు ఆమోదం తెలిపింది. రాజధాని నగరం అమరావతిలో రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం, శాసనసభ, సచివాలయ నిర్మాణ పనులకు భారీగా నిధుల కేటాయించింది. సమీకృత సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాల నిర్మాణ వ్యయం రూ.6,641 కోట్లకు పెంచింది.
ఏపీజెన్కోకు పర్మిషన్..
రాజధాని అమరావతి (Amaravati)లో గ్రీన్ వర్క్స్ ప్యాకేజీ-2 కింద రూ.180.68 కోట్ల అభివృద్ధి పనులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అమరావతి పరిధిలోని గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి రూ.1,215 కోట్ల విలువైన పనులకు పచ్చజెండా ఊపింది. శాఖమూరులో అమరావతి సంగమం నిర్మాణానికి రూ.626 కోట్ల ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విద్యుత్ అవసరాలకు కోల్ ఇండియాతో జాయింట్ వెంచర్ ఏర్పాటుకు ఏపీజెన్కోకు పర్మిషన్ ఇచ్చింది. మైలవరంలో 1,000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్రాజెక్టుకు 1,127 ఎకరాల భూమి కేటాయించింది. నంద్యాల జిల్లాలో 210 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్టు బదిలీ చేసేందుకు అనుమతినిచ్చింది.

