కలం, నల్లగొండ : కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ డిసెంబర్ 1న భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిర్వహించనున్న ‘జైల్‌భరో’ కార్యక్రమాన్ని (Jail Bharo Protest) జయప్రదం చేయాలని సిపిఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం నల్లగొండ జిల్లా పార్టీ కార్యాలయం మగ్దుమ్ భవన్లో జిల్లా కార్యవర్గ సభ్యుడు బంటు వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన సిపిఐ జిల్లా కౌన్సిల్ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అనుసరిస్తున్న విధానాల వల్ల దేశంలో ఆర్థిక అసమానతలు పెరిగి సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పల్లా వెంకటరెడ్డి విమర్శించారు. దేశ సంపదను కార్పొరేట్, పెట్టుబడిదారీ శక్తులకు కట్టబెడుతున్నారని ఆరోపించిన ఆయన, మరోవైపు నిరుద్యోగం పెరుగుతున్నా ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయడంలో కేంద్రం నిర్లక్ష్యం వహిస్తోందంటూ తక్షణమే ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.
దళితులు, మైనారిటీలు, ఆదివాసీలు, మహిళలపై దాడులు పెరుగుతున్నా కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ, ఆయా వర్గాలకు రక్షణ కల్పించాలని కోరారు. దేశంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) పేరుతో బీజేపీ వ్యతిరేక ఓట్లను తొలగించే ప్రయత్నం జరుగుతోందని పల్లా వెంకటరెడ్డి ఆరోపించారు.
ఏపీ నీటి దోపిడిపై విచారణ చేయించాలి: ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) నిబంధనలను ఉల్లంఘిస్తూ నాగార్జునసాగర్ కుడి కాలువ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా నీటిని తరలిస్తోందని సిపిఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం తీవ్రంగా ఖండించారు. ఈ వ్యవహారం తెలంగాణ నీటి ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తోందని ఆందోళన వ్యక్తం చేసిన ఆయన, ఏపీ ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించేందుకు అవకాశం కల్పించడం వెనుక ఆంతర్యమేమిటని నిలదీశారు.
నాగార్జునసాగర్ కుడి కాలువ ద్వారా నీటి తరలింపు వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని నెల్లికంటి సత్యం డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వానికి సమాచారం ఇవ్వకుండా వ్యవహరించిన నాగార్జునసాగర్ ప్రాజెక్టు సూపరింటెండింగ్ ఇంజనీర్ (ఎస్ఈ)ను తక్షణమే విధుల నుంచి తొలగించాలని కోరారు. తెలంగాణ నీటి హక్కుల విషయంలో ఎలాంటి రాజీ పడేది లేదని, రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు సిపిఐ ఆధ్వర్యంలో ప్రజా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు.
సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పల్లా నర్సింహారెడ్డి, సీనియర్ నాయకులు ఉజ్జిని రత్నాకర్‌రావు, మల్లేపల్లి ఆదిరెడ్డి, జిల్లా సహాయ కార్యదర్శి పల్లా దేవేందర్‌రెడ్డి, లోడంగి శ్రవణ్‌కుమార్, జిల్లా కార్యవర్గ సభ్యులు ఉజ్జిని యాదగిరిరావు, పబ్బు వీరస్వామి, ఆర్. అంజయ్యచారి, బొల్లుగూరి నర్సింహ, గుర్రిజ రామచంద్రం, టి. వెంకటేశ్వర్లు, నల్పరాజు రామలింగయ్య, తూము బుచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

