కలం, కరీంనగర్ బ్యూరో : ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్న కరీంనగర్‌లోని ఓ ప్రముఖ రెస్టారెంట్‌పై తెలంగాణ ఫుడ్ సేఫ్టీ విభాగం కఠిన చర్యలు తీసుకుంది. అపరిశుభ్ర వాతావరణంలో ఆహారం తయారు చేస్తున్న వావిలాలపల్లిలోని ‘క్లాసిక్ అభిరుచి మల్టీ క్యూజిన్ ఫ్యామిలీ రెస్టారెంట్’(Classic Abhiruchi Restaurant) FSSAI లైసెన్స్‌ను తక్షణమే సస్పెండ్ చేస్తూ అధికారులు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ తనిఖీల్లో ఆహార భద్రత, పారిశుధ్య నిబంధనలకు విరుద్ధంగా ఉన్న పలు తీవ్రమైన లోపాలను అధికారులు గుర్తించారు.
రిఫ్రిజిరేటర్ అడుగుభాగంలో పాత మాంసం నుంచి కారిన రక్తం గడ్డకట్టి ఉండగా, నిమ్మకాయలపై ఫంగస్ పెరిగి ఉంది. సుమారు 30 కిలోల మాంసం, పన్నీర్‌ను ఎలాంటి లేబులింగ్ లేకుండా నిల్వ చేశారు. నిషేధిత పచ్చి గుడ్ల మయోనైజ్, బిర్యానీలో ఫుడ్ కలర్స్ వాడుతున్నట్లు తేలింది. టాయిలెట్‌కు ఆనుకుని పాత్రలు కడుగుతుండటం, ఓపెన్ డ్రైన్లు బ్లాక్ కావడం, దెబ్బతిన్న ఫ్లోరింగ్‌ను అధికారులు గుర్తించారు. ఎగ్జాస్ట్ ఫ్యాన్లపై నల్లటి మసి పేరుకుపోయింది.
ఆహార పదార్థాలపై మూతలు లేకపోవడం, పాడైపోయిన ప్లాస్టిక్ చాపింగ్ బోర్డులను వాడటం, సిబ్బంది గ్లౌజులు, హెడ్ క్యాప్స్ ధరించకపోవడంపై అధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజారోగ్యానికి తీవ్ర ముప్పు వాటిల్లే ప్రమాదం ఉన్నందున రెస్టారెంట్ ఎఫ్ ఎస్ ఎస్ ఏ లైసెన్స్ ను తక్షణమే సస్పెండ్ చేశారు. సస్పెన్షన్ కాలంలో ఆహార తయారీ, నిల్వ, విక్రయాలను పూర్తిగా నిలిపివేయాలని ఆదేశించారు. లోపాలన్నీ సరిదిద్దుకుని అధికారుల నుంచి లిఖితపూర్వక అనుమతి పొందిన తర్వాతే తిరిగి కార్యకలాపాలు ప్రారంభించాలని స్పష్టం చేశారు.

