కలం, వరంగల్: వరంగల్ నగర ప్రజలకు మెరుగైన తాగునీటి సరఫరా అందించేందుకు చేపడుతున్న 20 ఎంఎల్డీ సామర్థ్యం గల నూతన నీటి శుద్ధి కేంద్రం నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలని జీడబ్ల్యూఎంసీ కమిషనర్ వెంకన్న (GWMC Commissioner Venkanna) అధికారులను ఆదేశించారు. శుక్రవారం కాకతీయ యూనివర్సిటీ ఫిల్టర్ బెడ్ వద్ద యూఐడీఎఫ్ నిధులతో చేపట్టనున్న ప్లాంట్ నిర్మాణ స్థలాన్ని ఆయన పరిశీలించారు. టెండర్ ప్రక్రియ పూర్తయినందున నిర్మాణంలో జాప్యం చేయరాదని పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ అధికారులకు స్పష్టం చేశారు. స్థలాన్ని ఇప్పటికే పబ్లిక్ హెల్త్ శాఖకు అప్పగించిన నేపథ్యంలో పనుల ప్రారంభానికి అవసరమైన చర్యలు చేపట్టాలని, నిర్ణీత గడువులోగా నిర్మాణం పూర్తి చేసేలా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని సూచించారు.
గవర్నర్ పర్యటన ఏర్పాట్లపై సమీక్ష..
మరోవైపు శనివారం కాకతీయ యూనివర్సిటీలో రాష్ట్ర గవర్నర్ పాల్గొననున్న స్నాతకోత్సవ కార్యక్రమానికి సంబంధించి బల్దియా ఆధ్వర్యంలో చేపడుతున్న ఏర్పాట్లను కమిషనర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆడిటోరియంలోని సభా వేదిక, హెలిప్యాడ్, రహదారులు, పరిసర ప్రాంతాలను సందర్శించి ఏర్పాట్ల పురోగతిని సమీక్షించారు.
గవర్నర్ పర్యటన నేపథ్యంలో ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా సభా ప్రాంగణం, హెలిప్యాడ్, రహదారులతోపాటు పరిసర ప్రాంతాల్లో పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని, చెత్తాచెదారం లేకుండా పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. అవసరమైన చోట పారిశుద్ధ్య సిబ్బందిని అందుబాటులో ఉంచి, కార్యక్రమం ముగిసే వరకు నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు.
ఈ పర్యటనల్లో పబ్లిక్ హెల్త్ ఈఈ సూచరన్, డీఈ ముజామిల్, బల్దియా ఈఈ రవికుమార్, డీఈ సారంగం, కేయూ అధికారులు, ఇంజనీరింగ్, పారిశుద్ధ్య విభాగాల సిబ్బంది పాల్గొన్నారు.

