కలం, ఖమ్మం బ్యూరో: తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పదేళ్ల పాలనలో ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) కేటాయింపుల్లో ఎలాంటి పక్షపాతానికి తావులేకుండా ప్రజాప్రతినిధులందరి సిఫార్సులను సమదృష్టితో చూశారని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర (Vaddiraju Ravi Chandra) అన్నారు. కానీ నేటి కాంగ్రెస్ ప్రభుత్వంలో తీవ్ర వివక్ష కొనసాగుతోందని విమర్శించారు. రాజకీయాలకు అతీతంగా, మానవీయ కోణంలో ఆలోచించి పేదలకు తక్షణమే వైద్య సాయం అందించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం ఖమ్మంలోని తెలంగాణ భవన్లో ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ సిఫార్సుతో మంజూరైన 86 సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది.
ఎంపీ వద్దిరాజు ఎమ్మెల్సీ మధుతో కలిసి లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ వైఖరిని తప్పుబట్టారు. అనారోగ్యానికి గురైన పేదలకు అవసరమైన వైద్య సేవల కోసం ఆర్థిక భరోసా కల్పించడమే సీఎంఆర్ఎఫ్ పథకం ముఖ్య ఉద్దేశమని, అయితే నిధుల మంజూరులో ప్రస్తుత సర్కార్ వివక్ష చూపడం బాధాకరమని అన్నారు.
దరఖాస్తు చేసుకున్న తర్వాత వాటి పరిశీలన, నిధుల కేటాయింపు, మంజూరు, చెక్కుల ప్రింటింగ్, విడుదలకు ప్రభుత్వం చాలా సమయం తీసుకుంటోందని ఎంపీ రవిచంద్ర ఆరోపించారు. ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల సిఫార్సుల పట్ల తీవ్ర నిర్లక్ష్యం వహిస్తూ, చాలా తక్కువ శాతం నిధులను మాత్రమే మంజూరు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత బీఆర్ఎస్ హయాంలో ఖమ్మం జిల్లా పేదలు, రోగులకు సీఎంఆర్ఎఫ్ ద్వారా వందల కోట్ల రూపాయల ఆర్థిక సాయం అందిందని గుర్తుచేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం పక్షపాత ధోరణిని వీడి, దరఖాస్తులను వీలైనంత త్వరగా పరిష్కరించి అర్హులందరికీ చెక్కులు విడుదల చేయాలని ఎంపీ వద్దిరాజు కోరారు.

