వెలుగుమట్లలో ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవానికి సన్నాహాలు : మంత్రి తుమ్మల

కలం, ఖమ్మం బ్యూరో: ఖమ్మం నగరంలోని నిరుపేదలకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. నగరపాలక సంస్థ పరిధిలోని 15వ డివిజన్ వెలుగుమట్లలో భూదాన్ భూమిలో నిర్మిస్తున్న 310 ఇందిరమ్మ ఇండ్లు(Indiramma Houses) , మౌలిక సదుపాయాల కాలనీని అతి త్వరలోనే ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వర రావు (Minister Thummala Nageswara Rao) వెల్లడించారు. శుక్రవారం ఆయన జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్‌తో కలిసి కాలనీలో పర్యటించి నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

​ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు దాదాపు పూర్తయ్యాయని, మిగిలిన సుమారు 10 శాతం పనులను మరో వారం నుంచి పది రోజుల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కాలనీలో పేదల అవసరాల కోసం నిర్మిస్తున్న బస్తీ దవాఖాన, అంగన్వాడీ కేంద్రం, కమ్యూనిటీ హాల్, షాపింగ్ కాంప్లెక్స్, పార్క్, డ్రెయినేజీలు, ఓపెన్ జిమ్ పనులను ఆయన తనిఖీ చేసి, నాణ్యతతో త్వరగా పూర్తి చేయాలని సూచించారు.

ప్రస్తుతం ‘భారత్ సమ్మిట్’ చివరి రోజు కార్యక్రమం ఉన్న నేపథ్యంలో, సీఎంను సంప్రదించి ఆయన ఇచ్చే తేదీకి అనుగుణంగా పనులన్నీ సిద్ధం చేసేలా కలెక్టర్, హౌసింగ్, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు యుద్ధ ప్రాతిపదికన పనిచేస్తున్నారని తెలిపారు. గతంలో వెలుగుమట్ల ప్రాంతంలో కూలీ నాలీ చేసుకునే వేలాది మంది పేదలను కొందరు వ్యక్తులు సంఘాల పేరుతో నకిలీ పట్టాలు ఇచ్చి డబ్బులు వసూలు చేయడంతో పాటు దౌర్జన్యాలకు పాల్పడ్డారని మంత్రి గుర్తు చేశారు.

ఈ వ్యవహారంలో ఆ సంఘాలు కోర్టుకు వెళ్లగా, భూదాన్ భూమిని ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకుని నిజమైన పేదలకు సౌకర్యాలు కల్పించాలని హైకోర్టు స్పష్టమైన ఆదేశాలిచ్చిందన్నారు. కోర్టు ఉత్తర్వుల మేరకు, ముఖ్యమంత్రి నిర్ణయంతో అప్పట్లో అక్కడ నివసిస్తున్న అసలైన నిరుపేదల పేరిట ఈ 310 ఇండ్ల నిర్మాణం చేపట్టి న్యాయం చేస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు. ​ఈ కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ కె. శ్రీరామ్, హౌజింగ్ పీడీ భూక్యా శ్రీనివాస్, ఖమ్మం మార్కెట్ కమిటీ చైర్మన్ హన్మంత రావు, ఖమ్మం అర్బన్ తహసీల్దార్ జయ చంద్ర, నగరపాలక సంస్థ డీఈ నవ్యజ్యోతి, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>