కలం, వెబ్ డెస్క్: భారత్‌లో దాడికి కుట్ర చేస్తున్న ఉగ్రవాదిని గుజరాత్ ఏటీఎస్ (Gujarat ATS) పోలీసులు వడోదరలో అరెస్ట్ చేశారు. అతడి నుంచి ఏకే-47 తుపాకీ, 23 రౌంట్ల బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. అసోం రాష్ట్రానికి చెందిన 22 ఏళ్ల మహమ్మద్ సహరుల్ ఇస్లాం కొంతకాలంగా పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ నాయకులతో సంబంధాలు కొనసాగిస్తున్నట్లు నిఘా విభాగం పసిగట్టింది. ఇతను వడోదరలోని ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌పై దాడికి ప్లాన్ చేస్తున్నట్లు తమకు సమాచారం అందినట్లు ఏటీఎస్ డీఐజీ సునీల్ జోషి వెల్లడించారు. ఈ మేరకు పలుమార్లు ఎయిర్ ఫోర్స్ స్టేషన్ వద్ద రెక్కీ నిర్వహించడంతో పాటు ఫొటోలు కూడా తీసుకున్నాడని వివరించారు.
23న ప్లాన్ చేసినా..
పాకిస్థాన్‌కు చెందిన టెర్రరిస్ట్ హ్యాండ్లర్ ఇతనికి టచ్‌లో ఉండి.. ఎక్కడ దాడి చేయాలో, అనంతరం అక్కడి నుంచి తప్పించుకుని ఎలా పాకిస్థాన్ రావాలో సూచనలు చేశాడని డీఐజీ సునీల్ జోషి స్పష్టం చేశారు. గత ఏడాది కాలంగా ఇతను జైషే నాయకులతో సంబంధాలు పెట్టుకున్నట్లు గుర్తించామన్నారు. ఇతడి కదలికలను కేంద్ర నిఘా సంస్థలు, గుజరాత్ ఏటీఎస్ గమనిస్తూ వస్తున్నాయని.. గత ఆరు నెలలుగా అతను ఏయే ప్రాంతాల్లో తిరిగాడో సమాచారం సేకరించినట్లు తెలిపారు. నవంబర్ 23వ తేదీన అనుకున్న ప్లాన్ ప్రకారం, వడోదరలోని ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌పై దాడి చేసేందుకు ప్రయత్నించగా.. వెంటనే అదుపులోకి తీసుకున్నట్లు సునీల్ జోషి తెలిపారు. అతడి వద్ద ఎలక్ట్రానిక్ పరికరాలు స్వాధీనం చేసుకుని, మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

