ఇందిరమ్మ జీవిత బీమా నమోదులో చండూరు మున్సిపాలిటీ జిల్లా టాప్

కలం, మునుగోడు : ఇందిరమ్మ జీవిత బీమా పథకం నమోదు ప్రక్రియలో చండూరు మున్సిపాలిటీ (Chandur Municipality) జిల్లా స్థాయిలో ప్రథమ స్థానంలో కొనసాగుతోంది. ఈ నెల 19న ప్రారంభమైన నమోదు కార్యక్రమంలో భాగంగా చండూరు మున్సిపాలిటీలో మొత్తం 3,971 రేషన్ కార్డులు ఉండగా, గురువారం రాత్రి వరకు 1,961 రేషన్ కార్డుల నమోదు పూర్తయింది. జిల్లాలోని గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీలలో జరుగుతున్న నమోదు ప్రక్రియను పరిశీలిస్తే చండూరు మున్సిపాలిటీ ముందంజలో ఉండటం విశేషం.

మరో రెండు, మూడు రోజుల్లో నమోదు ప్రక్రియను పూర్తి చేసేలా మున్సిపల్ అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఇప్పటివరకు నమోదు చేసుకోని కుటుంబాల కోసం మున్సిపల్ సిబ్బంది నేరుగా వార్డుల్లోని వీధులకు వెళ్లి నమోదు చేస్తున్నారు. సోమవారం తర్వాత కూడా నమోదు చేసుకోని వారు మున్సిపాలిటీ కార్యాలయంలో నమోదు చేసుకునే అవకాశం ఉంటుందని మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు, కమిషనర్ ఎల్. మల్లేశం తెలిపారు. అర్హులైన ప్రతి కుటుంబం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు సూచించారు.

నమోదు ప్రక్రియను మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు, కమిషనర్ ఎల్. మల్లేశం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ సిబ్బందికి తగిన సూచనలు చేస్తున్నారు. ముఖ్యంగా నమోదు తక్కువగా ఉన్న వార్డులు, వీధులపై ప్రత్యేక దృష్టి సారించి ప్రజలకు అవగాహన కల్పిస్తూ సిబ్బంది చురుగ్గా విధులు నిర్వహిస్తున్నారు. ప్రతి అర్హ కుటుంబం ఈ పథకంలో నమోదు అయ్యేలా కృషి చేస్తున్నారు. కమిషనర్ ఎల్. మల్లేశం బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి చండూరు మున్సిపాలిటీని పలు కార్యక్రమాల్లో జిల్లా స్థాయిలోనే కాకుండా కొన్ని అంశాల్లో రాష్ట్ర స్థాయిలోనూ ముందువరుసలో నిలిపేందుకు ప్రత్యేక చొరవ చూపుతున్నారని స్థానికంగా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.

కుటుంబాలకు రూ.5 లక్షల జీవిత బీమా భరోసా ఇందిరమ్మ జీవిత బీమా పథకం ద్వారా రేషన్ కార్డులో నమోదైన కుటుంబానికి చెందిన కుటుంబ పోషకుడు మరణించిన సందర్భంలో, పథకం నిబంధనల ప్రకారం రూ.5 లక్షల బీమా పరిహారం ఎల్‌ఐసీ ద్వారా కుటుంబానికి అందుతుంది. ఇందుకోసం రేషన్ కార్డులో పేర్కొన్న కుటుంబ పోషకుడు తన ఆధార్ కార్డు, రేషన్ కార్డుతో వెళ్లి నమోదు చేసుకోవాలి. కాబట్టి ఇప్పటివరకు నమోదు చేసుకోని అర్హులైన కుటుంబాలు ఆలస్యం చేయకుండా వెంటనే నమోదు చేసుకొని ప్రభుత్వ బీమా భరోసాను పొందాలని మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు, కమిషనర్ ఎల్. మల్లేశం కోరారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>