కలం, నిర్మల్ : పంట మార్పిడి విధానాలపై రైతుల్లో ఎప్పటికప్పుడు విస్తృత అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా (Collector Bhavesh Mishra) ఆదేశించారు. గురువారం సాయంత్రం జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో అధికారులతో వ్యవసాయ సంబంధిత అంశాలపై ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రస్తుత నీటి లభ్యత పరిస్థితుల నేపథ్యంలో తక్కువ నీటితో సులభంగా సాగయ్యే పంటలను మాత్రమే వేసేలా రైతులను అధికారులు ప్రోత్సహించాలని చెప్పారు.
వరి పంటకు ప్రత్యామ్నాయంగా ఇతర పంటలను సాగు చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. వ్యవసాయ శాఖ అధికారులంతా తప్పనిసరిగా క్షేత్రస్థాయిలో ఉంటూ రైతులకు సహకారం అందించాలన్నారు. వేసవిలో ఉష్ణోగ్రతలు పెరిగి, భూగర్భ జలాలు తగ్గిపోయే అవకాశం ఉన్నందున ఎక్కువ నీటితో పండే పంటలు వేస్తే రైతులు నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. ప్రస్తుత, రానున్న రోజుల్లోని వాతావరణ పరిస్థితులు, నీటి లభ్యత వివరాలను రైతులకు వివరిస్తూ వారిలో చైతన్యం కల్పించాలన్నారు.
భూగర్భ జలాల స్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ ఉండాలని పేర్కొన్నారు. ఫార్మర్ రిజిస్ట్రీ ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలన్నారు. ఏవైనా సాంకేతికపరమైన సమస్యలు తలెత్తితే వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. మండలాల వారీగా ఫార్మర్ రిజిస్ట్రీ ప్రక్రియను సమీక్షించారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సుజాత, ఉద్యానవన పంటల అధికారి రమణ, తదితరులు పాల్గొన్నారు.

