లంబాడాల అభ్యున్నతికి కృషి చేస్తా: సీఎం రేవంత్ రెడ్డి

కలం, అచ్చం పేట: లంబాడా సోదరుల అభ్యున్నతి, ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనకు తమ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. గురువారం నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని మద్దిమడుగులో నిర్వహించిన కార్యక్రమంలో సంత్ సేవాలాల్ మహారాజ్‌ను స్మరించుకుంటూ ముఖ్యమంత్రి ప్రసంగించారు. అనంతపురంలో జన్మించిన సంత్ సేవాలాల్ మహారాజ్ సమాజానికి మంచి మార్గాన్ని చూపించారని, మద్యం, మాంసానికి దూరంగా ఉంటూ ఆదర్శవంతమైన జీవితాన్ని గడపాలని బోధించారని సీఎం పేర్కొన్నారు. లంబాడా సోదరులందరికీ సేవాలాల్ మహారాజ్ ఆరాధ్య దైవమని అన్నారు.

లంబాడా జాతి బ్రిటిష్ పాలకులను, నిజాం నవాబును ఎదిరించి పోరాడిన ధైర్యసాహసాల చరిత్ర కలిగిన సమాజమని కొనియాడారు. నమ్మిన వారి కోసం ప్రాణాలైనా ఇచ్చే గొప్ప లక్షణం లంబాడా సోదరుల సొంతమని పేర్కొన్నారు. గతంలో కొన్ని రాజకీయ పార్టీలు లంబాడాలను కేవలం ఓటు బ్యాంకుగా చూశాయని విమర్శించారు. ఇందిరాగాంధీ మాత్రమే వారి పోరాట పటిమను గుర్తించి సమాన అవకాశాలు కల్పించారని తెలిపారు.
జైపాల్ రెడ్డి కృషితో 1976లో లంబాడాలను షెడ్యూల్డ్ తెగల జాబితాలో చేర్చారని, రిజర్వేషన్ల ద్వారా అనేక మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులుగా, ఉన్నత పదవుల్లో స్థిరపడ్డారని సీఎం గుర్తుచేశారు. ఇందిరాగాంధీ హయాంలో దున్నేవాడికే భూమి అనే లక్ష్యంతో 12 లక్షల ఎకరాల భూమిని లంబాడా సోదరులకు పంపిణీ చేసినట్లు తెలిపారు. ప్రతి లంబాడా ఇంట్లో ఇందిరమ్మ చిత్రపటం సంత్ సేవాలాల్ మహారాజ్ చిత్రపటం పక్కన కనిపిస్తుందని అన్నారు.

తమ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ద్వారా ఎస్సీ, ఎస్టీ వర్గాలకు పెద్ద ఎత్తున లబ్ధి చేకూరుతోందని చెప్పారు. రాష్ట్రంలో మంజూరు చేసిన 8 లక్షల ఇందిరమ్మ ఇళ్లలో సుమారు 4 లక్షల ఇళ్లు ఎస్సీ, ఎస్టీలకు అందాయని తెలిపారు. 3.40 కోట్ల మందికి సన్నబియ్యం పంపిణీ చేస్తుండగా గిరిజన, లంబాడా కుటుంబాలు కూడా అధికంగా లబ్ధి పొందుతున్నాయని పేర్కొన్నారు. అచ్చంపేట, నల్లమల ప్రాంతం తన జన్మభూమి అని, ఈ ప్రాంత బిడ్డగా చెప్పుకోవడం గర్వంగా ఉంటుందని సీఎం అన్నారు. మాట ఇస్తే దాని కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడే లక్షణం ఈ ప్రాంతం నుంచే నేర్చుకున్నానని తెలిపారు. గత ఎన్నికల ప్రచారంలో వంశీకృష్ణను గెలిపిస్తే అచ్చంపేటకు ఇద్దరు ఎమ్మెల్యేల బలం ఉంటుందని చెప్పానని, ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటికే రూ.450 కోట్ల నిధులను అచ్చంపేట నియోజకవర్గానికి తీసుకువచ్చానని వెల్లడించారు.

మద్దిమడుగులో సంత్ సేవాలాల్ మహారాజ్ ఆలయ నిర్మాణం కోసం ప్రస్తుతం ఉన్న 16 ఎకరాలకు అదనంగా మరో నాలుగు ఎకరాలు సేకరించి మొత్తం 20 ఎకరాల్లో దేశానికే తలమానికంగా నిలిచేలా ఆలయాన్ని నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఎస్టీల కోసం ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేసి, దాని చైర్మన్‌గా లంబాడా సోదరుడికి అవకాశం కల్పిస్తామని ప్రకటించారు. రాజకీయాల్లో లంబాడాలకు రావాల్సిన ప్రాతినిధ్యాన్ని ఢిల్లీ స్థాయిలో పోరాడి సాధిస్తామని భరోసా ఇచ్చారు. లంబాడా సోదరులు తమ ప్రభుత్వానికి అండగా నిలవాలని, వారి విద్య, ఉద్యోగ, ఉపాధి, రాజకీయ ప్రాతినిధ్యం, సమగ్ర అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) స్పష్టం చేశారు.

Also Read : తాజ్ మహల్‌పై వానర‌సేన దండయాత్ర.. వీడియో వైరల్!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>