కలం, ఇల్లంతకుంట: ఇల్లంతకుంట(Ellanthakunta) మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షుడు పల్లె నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్, కరీంనగర్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు హాజరయ్యారు.
ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 2009 నవంబర్ 29న కేసీఆర్ ప్రారంభించిన నిరవధిక నిరాహార దీక్ష ఉద్యమ చరిత్రలో కీలక మలుపుగా నిలిచిందని అన్నారు. ఈ దీక్షతోనే తెలంగాణ ప్రజల ఆకాంక్ష దేశవ్యాప్తంగా మారుమోగిందని పేర్కొన్నారు. కేసీఆర్ త్యాగం, ఉద్యమ స్ఫూర్తికి గుర్తుగా ప్రతి ఏడాది నవంబర్ 29న దీక్షా దివస్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మానకొండూర్ నియోజకవర్గంలోని అల్గునూర్లో నవంబర్ 29న మధ్యాహ్నం 3 గంటలకు దీక్షా దివస్ మహా బహిరంగ సభ (Deeksha Diwas Sabha) నిర్వహించనున్నట్లు వెల్లడించారు. సభకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, తెలంగాణ ఉద్యమకారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ రాష్ట్రం ఎవరో ఇచ్చిన భిక్ష కాదని, వేలాది మంది అమరవీరుల త్యాగాలు, లక్షలాది మంది ఉద్యమకారుల పోరాట ఫలితమని నేతలు అన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలలో జరిగిన అన్యాయాన్ని ఎదిరించి కేసీఆర్ స్వరాష్ట్ర సాధన కోసం పోరాడారని పేర్కొన్నారు. తెలంగాణ సాధనలో చూపిన పట్టుదలను రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణలోనూ కొనసాగించాలని అన్నారు. ప్రభుత్వం రైతులకు ఇచ్చిన భరోసా, యువతకు ఉద్యోగాలు, సాగునీటి ప్రాజెక్టులపై ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు, మండల ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, తెలంగాణ ఉద్యమకారులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

