కొండగట్టులో భక్తుల ఇక్కట్లు.. ఏర్పాట్లపై ఆగ్రహం

కలం, కరీంనగర్ బ్యూరో : కార్తీక పౌర్ణమి పర్వదినం, స్వామివారి నిజరూప దర్శనం సందర్భంగా జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ఆలయం (Kondagattu Temple) మంగళవారం భక్తజన సంద్రంగా మారింది. గిరిప్రదక్షిణతో పాటు అంజన్నను దర్శించుకునేందుకు తెల్లవారుజాము నుంచే రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోయాయి.

భక్తుల రద్దీ ఊహించిన దానికంటే ఎక్కువగా ఉండటంతో స్వామివారి దర్శనం కోసం గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. రద్దీకి అనుగుణంగా కనీస ఏర్పాట్లు లేకపోవడంతో క్యూలైన్లలో చిన్నారులు, వృద్ధులు, మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సుమారు లక్ష మందికి పైగా భక్తులు కొండగట్టుకు వచ్చి స్వామివారిని దర్శించుకున్నట్లు అంచనా.

చరిత్రలోనే తొలిసారి.. ప్రధాన ద్వారం మూసివేత

భక్తుల రద్దీ అదుపుతప్పి, కొందరు బ్యారికేడ్లు దాటి క్యూలైన్లలోకి చొచ్చుకురావడంతో ఆలయ సిబ్బంది అప్రమత్తమయ్యారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు కొద్దిసేపు ఆలయ ప్రధాన ద్వారాన్ని మూసివేశారు. అయితే ఆలయ చరిత్రలోనే ప్రధాన ద్వారం మూసివేయాల్సిన పరిస్థితి ఏర్పడటం ఇదే తొలిసారంటూ భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ముందస్తు ప్రణాళిక ఏది?

కార్తీక పౌర్ణమి వంటి ముఖ్యమైన పర్వదినాల్లో భక్తుల రద్దీ భారీగా ఉంటుందని తెలిసినా అధికారులు ముందస్తు ప్రణాళికతో ఏర్పాట్లు చేయడంలో విఫలమయ్యారని విమర్శలు వెల్లువెత్తాయి. భవిష్యత్తులో ఇలాంటి అవాంఛనీయ పరిస్థితులు తలెత్తకుండా రద్దీ నియంత్రణ, పటిష్టమైన క్యూలైన్ల నిర్వహణ, భక్తులకు కనీస సౌకర్యాల కల్పనపై ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని భక్తులు కోరుతున్నారు.

కొండగట్టు స్వామివారికి యాదగిరిగుట్ట పట్టువస్త్రాల సమర్పణ

మరోవైపు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం నుంచి శ్రీ కొండగట్టు ఆంజనేయస్వామివారికి పట్టువస్త్రాలు తీసుకువచ్చారు. ఆలయ సంప్రదాయాల ప్రకారం దేవస్థాన అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో పట్టువస్త్రాలను సాదరంగా స్వీకరించారు. అనంతరం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి స్వామివారికి పట్టువస్త్రాలను సమర్పించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>