కలం, వెబ్ డెస్క్: నేటి ఆధునిక జీవనశైలిలో చక్కెర వల్ల కలిగే అనర్థాలను గుర్తించిన తర్వాత, మన పూర్వీకులు వాడిన సహజసిద్ధమైన తీపి పదార్థాలపై మళ్లీ ఆసక్తి పెరుగుతుంది. వాటిలో అత్యంత శ్రేష్టమైనది తాటిబెల్లం (Palm Jaggery) గా చెప్పుకోవచ్చు. సూపర్ ఫుడ్ గా పిలువబడే ఈ తాటిబెల్లం కేవలం తీపి కోసం వాడే పదార్థం మాత్రమే కాదు, అనేక అనారోగ్య సమస్యలకు చక్కటి పరిష్కారం అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.
తాటిబెల్లాన్ని తాటి చెట్టు నుంచి సేకరించిన స్వచ్ఛమైన తాటి రసంతో, ఎలాంటి రసాయన శుద్ధి లేకుండా సంప్రదాయ పద్ధతిలో తయారుచేస్తారు. అయితే ఈ మధ్యకాలంలో చాలామంది తెల్లచక్కెరకు బదులుగా దీనిని రోజువారీ ఆహారంలో భాగం చేసుకుంటున్నారు. అసలు తాటిబెల్లాన్ని రోజూవారీ ఆహారంలో చేర్చుకోవడం వలన ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. నిపుణుల అభిప్రాయం ప్రకారం..
తాటిబెల్లం ప్రయోజనాలు
రక్తహీనత నివారణ: తాటిబెల్లంలో ఐరన్ శాతం ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. దీనివల్ల రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి పెరిగి రక్తహీనత ఉన్నవారికి మేలు చేస్తుందట.
జీర్ణక్రియ మెరుగుదల: తాటిబెల్లం జీర్ణక్రియను మెరుగుపరుస్తుందట. భోజనం తర్వాత చిన్న ముక్క తాటిబెల్లం తినడం వల్ల జీర్ణ ఎంజైమ్ లు చురుగ్గా పనిచేసి, అజీర్తి, గ్యాస్, మలబద్ధకం వంటి సమస్యలను తగ్గిస్తుందని చెబుతున్నారు.
గొంతు సమస్యలకు ఉపశమనం: తాటిబెల్లానికి శ్వాసకోశ నాళాలను శుభ్రపరిచే గుణం ఉందని చెబుతున్నారు నిపుణులు. దీనివల్ల పొడిదగ్గు, గొంతు గరగర తగ్గడానికి ఉపయోగపడుతుందట.
రోగనిరోధక శక్తి పెంపు: తాటిబెల్లంలో ఉండే యాంటీఆక్సిడెంట్లు, జింక్, ఖనిజాలు శరీర రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయని చెబుతున్నారు.
ఎముకలు, నాడీవ్యవస్థ ఆరోగ్యం: తాటిబెల్లంలో కాల్షియం, ఫాస్పరస్, మెగ్నీషియం, పొటాషియం ఉంటాయట. కాల్షియం, ఫాస్పరస్ ఎముకల ధృడత్వానికి ఉపయోగపడగా.. మెగ్నీషియం, పొటాషియం నాడీ వ్యవస్థ, రక్తపోటు సమతుల్యతకు తోడ్పడతాయని చెబుతున్నారు.
శరీర శుద్ధి: మన శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపడంలో, కాలేయ పనితీరుకు సహయపడుతుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.
ఎలా వినియోగించాలి?
మన రోజూవారీ ఆహరంలో తాటి బెల్లాన్ని ఈ రకంగా భాగం చేసుకోవచ్చు. తాటి పొడిని పాలలో కలిపి తాగడం, తీపి వంటకాల్లో కూడా ఈ పొడిని వినియోగించాలి. అయితే ఆ తాటి బెల్లంలో సహజంగానే చక్కెర ఉంటుంది కాబట్టి మధుమేహం ఉన్న వారు దీన్ని తక్కువగా తీసుకోవాలని చెబుతున్నారు.
Note: ఈ కథనంలో అందించిన సమాచారం కేవలం పాఠకుని అవగాహన కోసం మాత్రమే. దీనిని వైద్య సలహాగా భావించకూడదు. మీ ఆహారపు అలవాట్లలో ఏవైనా మార్పులు చోటుచేసుకునే ముందు ఖచ్చితంగా వైద్యులు లేదా పోషకాహార నిపుణుల సలహా తీసుకోవాలి.

