కలం, మహబూబ్ నగర్ బ్యూరో: కష్టాన్ని నమ్ముకుని జీవించే పేద, మధ్యతరగతి కుటుంబాలకు అండగా నిలవాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం రూ.5 లక్షల జీవిత బీమా పథకాన్ని ప్రవేశపెట్టిందని ప్రభుత్వ విప్, మహబూబ్నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి (Yennam Srinivas Reddy) అన్నారు. దేశమే ఆశ్చర్యపోయేలా పేద కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించే దిశగా ఇందిరమ్మ కుటుంబ జీవిత భీమా పథకాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు.
మహబూబ్నగర్ పట్టణంలోని బండమీద పల్లి (30వ డివిజన్)లో ఇందిరమ్మ కుటుంబ జీవిత భీమా పథకం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై లబ్దిదారులకు బీమా పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రోజువారీ కూలీ పనులకు వెళితేనే కుటుంబం గడిచే నిరుపేదలకు ఈ పథకం ఎంతో భరోసా కల్పిస్తుందని పేర్కొన్నారు. కుటుంబంలో సంపాదించే వ్యక్తి లేదా కుటుంబ పెద్దను కోల్పోయినప్పుడు ఆ కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటుందని తెలిపారు.
ఇలాంటి పరిస్థితుల్లో పేద కుటుంబాలకు అండగా నిలవాలనే గొప్ప ఆలోచనతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రూ.5 లక్షల వరకు జీవిత బీమా సౌకర్యాన్ని కల్పించారని వివరించారు. కుటుంబంలో ప్రధానంగా సంపాదించే వ్యక్తి ప్రమాదవశాత్తు లేదా ఇతర కారణాల వల్ల ప్రాణాలు కోల్పోతే, ఆ కుటుంబానికి తక్షణ ఆర్థిక భరోసా కల్పించడమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశమని తెలిపారు. పేద కుటుంబాలు ఆపద సమయంలో ఇతరులపై ఆధారపడకుండా గౌరవంగా జీవించేందుకు ఈ జీవిత బీమా పథకం ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
ప్రజల్లో ఈ పథకంపై విస్తృత అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. వార్డు కార్యాలయాలకు వచ్చి నమోదు చేసుకునేలా ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు, అక్కడే ఎన్రోల్మెంట్ సదుపాయాన్ని కూడా అందిస్తున్నామని చెప్పారు. రెండు, మూడు బృందాలు కలిసి ప్రజల్లోకి వెళ్లి పథకాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయని వివరించారు.
మంగళవారం డివిజన్ 30, 11 లలో నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించిందని ఆయన తెలిపారు. రేషన్ కార్డు కలిగిన కుటుంబాలకు ఈ జీవిత బీమా పథకం వర్తిస్తుందని, వివిధ కారణాల వల్ల రేషన్ కార్డు పొందలేకపోయిన అర్హులైన పేద కుటుంబాలకు కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తున్నామని వెల్లడించారు. వైభవ్నగర్ కార్పొరేషన్ పరిధిలోని అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ పథకంలో నమోదు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
పేదల సంక్షేమం, ఆర్థిక భద్రత, కుటుంబాలకు భరోసా కల్పించడం, సొంతింటి కల సాకారం చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. అర్హులైన ప్రతి కుటుంబం ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నగర డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సిరాజ్ ఖాద్రీ, వాల్దాస్ ప్రతాప్ గౌడ్, కార్పొరేటర్లు లక్ష్మీదేవి యాదగిరి గౌడ్ , విట్టల్ రెడ్డి, తాహేర్ తదితరులు పాల్గొన్నారు.

