కలం, వెబ్ డెస్క్ : దేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాళ్లలో మాదకద్రవ్యాల సమస్య ఒకటని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) పేర్కొన్నారు. దేశాభివృద్ధిలో కీలక భాగస్వామ్యం కావాల్సిన యువత డ్రగ్స్ బారిన పడి పక్కదారి పడుతోందని పేర్కొన్నారు. ఈ మహమ్మారి ఇప్పుడు ఢిల్లీ, హర్యానా, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాలకు కూడా వ్యాపించిందని తెలిపారు.
నవంబర్ 25 నుంచి 27 వరకు మూడు రోజుల పాటు హైదరాబాద్ వాక్స్ ఫర్ నషా ముక్త్ భారత్ పాదయాత్ర ఉంటుందని కిషన్ రెడ్డి తెలిపారు. అంబర్ పేట్ నుంచి జూబ్లీహిల్స్ వరకు సుమారు 29.8 కిలోమీటర్ల మేర ఈ పాదయాత్ర కొనసాగుతుందని ఆయన వెల్లడించారు. ప్రజలందరి సమష్టి భాగస్వామ్యంతోనే డ్రగ్స్ రహిత భారత్ నిర్మాణం సాధ్యమవుతుందని ఆయన పిలుపునిచ్చారు.
‘నషా ముక్త్ భారత్’కు ప్రభాస్ మద్దతు
డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం కోసం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నిర్వహిస్తున్న ‘హైదరాబాద్ వాక్స్ ఫర్ నషా ముక్త్ భారత్’ యాత్రకు సినీ నటుడు ప్రభాస్ మద్దతు తెలిపారు. యువత ఆరోగ్యకరమైన భవిష్యత్తు కోసం డ్రగ్స్ రహిత భారత్ నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

