కలం, వెబ్ డెస్క్ : తమిళనాడు రాజకీయాల్లో టీవీకే ఎమ్మెల్యే అరుల్ విఘ్నేష్‌పై (TVK MLA Arul Vignesh) వివాదం నెలకొంది. ఓ మహిళా జిల్లా కలెక్టర్‌కు అసభ్యకరమైన సందేశాలు పంపినట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విషయాన్ని మద్రాస్ హైకోర్టుకు పోలీసులు వెల్లడించారు. కల్లకురిచి నియోజకవర్గానికి చెందిన టీవీకే ఎమ్మెల్యే అరుల్ విఘ్నేష్ వ్యవహారంపై ఓ మహిళా న్యాయవాది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. కేసు నమోదు, దర్యాప్తు తీరుపై వివరాలు అడిగి తెలుసుకుంది. ప్రస్తుతం మహిళా పోలీస్ స్టేషన్ అధికారులు ఈ కేసును విచారిస్తున్నట్లు పోలీసుల తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. అయితే, ఈ వ్యవహారంలో ఎమ్మెల్యే పేరు ప్రస్తావనకు రావడంతో దర్యాప్తు నిష్పక్షపాతంగా సాగాలని హైకోర్టు సూచించింది. ఎస్పీ స్థాయి కంటే ఉన్నతాధికారి పర్యవేక్షణలో విచారణ జరపాలని ఆదేశించింది.
సోషల్ మీడియాలో ఉన్న అభ్యంతరకర పోస్టులను తొలగించే విషయంలో సైబర్ క్రైమ్ విభాగం వేగంగా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. అంతేకాకుండా, మహిళలపై కార్యాలయ వేధింపుల నిరోధక చట్టం (POSH) ప్రకారం అంతర్గత ఫిర్యాదుల కమిటీ ఏర్పాటు చేశారా అని ప్రశ్నించింది. దర్యాప్తు బృందాల వివరాలు, కమిటీ ఏర్పాటు స్థితిపై సమగ్ర నివేదిక సమర్పించాలని పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణను నవంబర్ 27కు వాయిదా వేసింది.

