నానమ్మ ఆస్తి మింగేసి.. రోడ్డున పడేసిన మనవడు!

కలం, ఖమ్మం బ్యూరో: ​మృత్యువుతో పోరాడుతూ, కన్నవారి ఆదరణ కరువై, ఆఖరి క్షణాల్లోనైనా కాసింత ప్రశాంతత కోరుకుంటున్న ఆ తల్లికి ఇప్పుడు కన్నవారే కాలయములై నిలిచారు. ఒకప్పుడు నవ్వుల పువ్వులలా కళకళలాడిన ఆ కుటుంబంలో, వృద్ధాప్యంలో ఆసరాగా నిలవాల్సిన చేతులే ఇప్పుడు ఆమె పాలిట శాపంగా మారాయి. నడవలేని స్థితిలో చక్రాల కుర్చీకి పరిమితమై, క్యాన్సర్ వంటి మహమ్మారితో పోరాడుతున్న 73 ఏళ్ల ఆ వృద్ధురాలు ‘ప్రజావాణి’ వేదికగా కన్నీరుమున్నీరైన తీరు, అక్కడి ప్రజల మనసులను కలచివేస్తోంది.

​భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల (Cherla) గ్రామానికి చెందిన గౌళికార్ ప్రమీల (లేట్ తులసీరావు గారి భార్య) తన భర్తతో కలిసి కటిక వ్యాపారం, మేకల మంద ద్వారా కష్టపడి సంపాదించిన ప్రతి రూపాయిని కుటుంబానికే ధారపోశారు. తన బాధ్యతలన్నీ తీర్చి, చివరి దశలో ప్రశాంతంగా గడపాలనుకున్న ఆమె జీవితంలో 2024 ఆగస్టు 13న పెద్ద కుమారుడు సత్యనారాయణ అనారోగ్యంతో మరణించడంతో కష్టాల సుడిగుండం మొదలైంది. అంతకుముందు ఎంతో నమ్మకంతో తన పెద్ద కుమారుడు సత్యనారాయణ చేతిలో పెట్టిన 43 తులాల బంగారం, రూ. 43,07,000 నగదు ఆయన మరణానంతరం పెద్ద కోడలు నాగుబాయి, మనవడు ప్రేమ్ కుమార్ గుప్పిట్లో చిక్కుకున్నాయి.

అంతేకాకుండా, ఉమ్మడి కుటుంబంలో భర్త స్వార్జితంతో కొన్న స్థలాల్లో రెండు పెద్ద కుమారుడి పేరు మీద ఉండగా, మరో స్థలాన్ని తన పేరు మీద కొంటానని చెప్పి మోసపూరితంగా పెద్ద కోడలు నాగుబాయి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించారనే ఆవేదన ప్రమీల మాటల్లో స్పష్టంగా వినిపిస్తోంది. మరోవైపు, హైదరాబాద్‌లో ప్రైవేటు ఉద్యోగం చేస్తూ తల్లి రొమ్ము క్యాన్సర్ (బ్రెస్ట్ క్యాన్సర్) చికిత్స ఖర్చులన్నీ మొదటి నుంచీ భరిస్తున్న చిన్న కుమారుడు గోవిందు కుటుంబానికి ఈ ఆస్తి పంపకంలో (Family Property Dispute) తీవ్ర అన్యాయం జరిగిందన్న ఆరోపణలు ఉన్నాయి.

​ఒకవైపు రొమ్ము క్యాన్సర్‌తో పోరాడుతూ, ప్రతి నెలా కీమోథెరపీ చేయించుకోవాల్సిన దీన స్థితిలో ఉన్న ప్రమీల పట్ల కంటికి రెప్పలా చూసుకోవాల్సిన మనవడు ప్రేమ్ కుమార్, పెద్ద కోడలు నాగుబాయి వ్యవహరిస్తున్న తీరు మానవత్వానికే మాయని మచ్చగా నిలుస్తోంది. నానమ్మకు కడుపునిండా తిండి పెట్టకపోగా, “ఎండ్రిన్ తాగి చచ్చిపో… ఎవరికీ చెప్పుకుంటావో చెప్పుకో” అంటూ మనవడు అత్యంత హేయంగా దూషిస్తున్నాడని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. తనను చూడటానికి వచ్చే ఇతర పిల్లలను సైతం అసభ్య పదజాలంతో తిడుతున్నారని, తమకు ప్రాణహాని ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతటితో ఆగకుండా, హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్న చిన్న కుమారుడికి తెలియకుండా తను ఉంటున్న ఇంటిని కూడా మనవడు ప్రేమ్ కుమార్ రూ. 50,000లకు తనఖా పెట్టడం ఆ పండుటాకును మరింత కుంగదీసింది.

​ఆస్తి, బంగారం గురించి అడిగినందుకు ప్రమీల, చిన్న కుమారుడు గోవిందుపై పెద్ద కోడలు, మనవడు కలిసి మూకుమ్మడిగా దాడి చేసినా, స్థానికంగా రాజకీయ పలుకుబడి ఉందన్న కారణంతో చర్ల పోలీసులు పట్టించుకోలేదనే తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. ​ఎటు చూసినా దారులు మూసుకుపోవడంతో, తన గోడు చెప్పుకోవడానికి సోమవారం నిర్వహించిన ‘ప్రజావాణి’ కార్యక్రమానికి చక్రాల కుర్చీలో వచ్చిన ప్రమీల, జాయింట్ కలెక్టర్ వేణుగోపాల్ ఎదుట కన్నీరుమున్నీరయ్యారు. “ఈ ఇల్లు, స్థలాలు వారసత్వపు ఆస్తి కాదని, నా భర్త స్వార్జితంతో కొన్నవని… నా భర్త సంపాదించిన ఆస్తి నాకు ఇప్పించండి అయ్యా, నా చివరి రోజుల్లోనైనా ప్రశాంతంగా బతుకుతాను” అంటూ ఆమె వేడుకున్న తీరు అక్కడున్న వారిని కంటతడి పెట్టించింది. ఆమె దీనస్థితిని చూసి చలించిపోయిన జాయింట్ కలెక్టర్, వెంటనే భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేయాలని సూచించారు.

​మృత్యువుతో పోరాడుతూ, కన్నవారే మరణశాసనం రాస్తున్న వేళ ఆ 73 ఏళ్ల తల్లికి కావాల్సింది కార్యాలయాల చుట్టూ తిరిగే శ్రమ కాదు—తక్షణ న్యాయం, వైద్యం, రక్షణ. తన భర్త కష్టార్జితంతో కొన్న ఇంటిని తిరిగి అప్పగించి, ప్రాణహాని నుంచి రక్షణ కల్పిస్తేనే ఆ ‘పండుటాకు’ చివరి రోజుల్లోనైనా కాసింత ఊపిరి పీల్చుకోగలదు. అధికారులు ఇకనైనా స్పందించి, ఆ వృద్ధురాలికి అండగా నిలవాలని మానవతావాదులు, స్థానికులు ముక్తకంఠంతో కోరుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>