కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాల మేరకు జూలూరుపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం సాయంత్రం నుండి పోలీసులు (Julurupadu Police) ప్రత్యేక నాకాబందీ తనిఖీలు చేపట్టారు. కొత్తగూడెం సబ్ డివిజన్ డీఎస్పీ ఆదినారాయణ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు నిర్వహించారు. మండల పరిధిలోని చంద్రుగొండ క్రాస్ రోడ్, మహదేవ్ హోటల్, పాలకొల్లు క్రాస్ రోడ్ సాయిబాబా ఆలయం వద్ద ప్రత్యేకంగా తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తూ, వాహనదారుల వివరాలు, వాహన పత్రాలను పరిశీలించారు. అలాగే అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా డీఎస్పీ ఆదినారాయణ మాట్లాడుతూ.. అసాంఘిక కార్యకలాపాలను అరికట్టడం, గంజాయి వంటి మత్తు పదార్థాల అక్రమ రవాణాను నిరోధించడం, నేరాల నియంత్రణ, రోడ్డు ప్రమాదాల నివారణతో పాటు శాంతిభద్రతలను పరిరక్షించడమే ఈ నాకాబందీ తనిఖీల ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ప్రజలు పోలీసుల తనిఖీలకు సహకరించాలని, తమ పరిసరాల్లో అనుమానాస్పద వ్యక్తులు లేదా అసాంఘిక కార్యకలాపాలకు సంబంధించిన సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు.

