కలం, యాదగిరిగుట్ట : బాల్యం పాఠశాల బాట పట్టాలి.. పెళ్లి పీటలు ఎక్కకూడదు..పసిప్రాయంలోనే పెళ్లి పేరుతో పిల్లల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసే బాల్య వివాహాల (Child Marriages) నిర్మూలనకు యాదాద్రి భువనగిరి జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ నడుం బిగించింది. బాలల హక్కుల పరిరక్షణ, వారి సంక్షేమం, బాల్య వివాహాల నివారణే లక్ష్యంగా జిల్లా స్థాయిలో అవగాహన కార్యక్రమాలకు ప్రాధాన్యత కల్పిస్తోంది. ఈ క్రమంలో జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి శ్రీమతి వి. మాధవి లత సోమవారం బొమ్మలరామారం, తుర్కపల్లి మండలాల పరిధిలోని బాలల సంరక్షణ కేంద్రాలను సందర్శించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
బాలల సంక్షేమ వసతులపై ప్రత్యేక దృష్టి
మాధాపూర్‌లోని గ్రేట్ కమిషన్ మినిస్ట్రీస్, ఆదరణ బాలల సంరక్షణ సంస్థలను సందర్శించిన ఆమె.. అక్కడ బాలలకు కల్పిస్తున్న వసతులు, సంక్షేమ సదుపాయాలు, సంరక్షణ ఏర్పాట్లను పరిశీలించారు. బాలలకు మెరుగైన వాతావరణం, భద్రత, అవసరమైన సదుపాయాలు అందించాలని సంస్థల నిర్వాహకులకు సూచనలు చేశారు.
బాల్య వివాహం ఎక్కడ జరిగినా సమాచారం ఇవ్వండి
అనంతరం మల్కాపూర్ గ్రామస్తులతో ముఖాముఖి నిర్వహించి బాల్య వివాహాల నిర్మూలనపై అవగాహన కల్పించారు. బాల్య వివాహాలు పిల్లల హక్కులను హరించడంతో పాటు వారి భవిష్యత్తుపై ప్రతికూల ప్రభావం చూపుతాయని వివరించారు. బాల్య వివాహాల నివారణలో గ్రామస్థులు అప్రమత్తంగా ఉండాలని, ఇలాంటి ఘటనలు ఎక్కడైనా గుర్తిస్తే మౌనంగా ఉండకుండా సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని పిలుపునిచ్చారు.
ప్రజల కోసం రెండు కీలక హెల్ప్‌లైన్ నంబర్లు
బాలల రక్షణ విషయంలో అత్యవసరంగా గుర్తుంచుకోవాల్సిన నంబర్లను కార్యదర్శి ప్రజలకు వివరించారు. 1098 – చైల్డ్ హెల్ప్‌లైన్: బాల్య వివాహాలు లేదా బాలల సంరక్షణకు సంబంధించిన సమస్యలపై సమాచారం అందించడానికి. 15100 – న్యాయ సేవల హెల్ప్‌లైన్: అవసరమైన న్యాయ సహాయం పొందడానికి. బాల్య వివాహాల నిర్మూలనలో యాదాద్రి భువనగిరి జిల్లా ముందుండాలని, బాలల హక్కులను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించాలని మాధవి లత సూచించారు.ఈ కార్యక్రమంలో న్యాయ సహాయ న్యాయవాది జి. నాగరాజు పాల్గొన్నారు.

