పినపాక అభివృద్ధికి రూ.130 కోట్ల ప్రతిపాదనలు.. ముగ్గురు మంత్రులకు ఎమ్మెల్యే వినతి

కలం, ఖమ్మం బ్యూరో : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గ సమగ్రాభివృద్ధి (Pinapaka Development) లక్ష్యంగా నియోజకవర్గ ఎమ్మెల్యే, ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్మన్ పాయం వెంకటేశ్వర్లు సోమవారం హైదరాబాద్‌లో ముగ్గురు రాష్ట్ర మంత్రులను కలిసి నిధుల మంజూరు కోసం వినతిపత్రాలు అందజేశారు. ​ముందుగా పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కను కలిసిన ఎమ్మెల్యే, నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం రూ. 44 కోట్ల అంచనా వ్యయంతో కూడిన ప్రతిపాదనలను సమర్పించారు.

ఈ నిధులతో బీటీ రోడ్లు, హైలెవల్ బ్రిడ్జిలు, చెప్టాలతో పాటు అంగన్‌వాడీ, గ్రామ పంచాయతీ మరియు ఈఓ (EO) భవనాల నిర్మాణం వంటి పనులు చేపట్టాల్సి ఉందన్నారు. అనంతరం గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌తో భేటీ అయిన పాయం వెంకటేశ్వర్లు, గిరిజన ప్రాంతాల అభివృద్ధి, విద్యా వసతుల మెరుగుదల కోసం రూ. 86 కోట్ల ప్రతిపాదనలను అందజేశారు. గిరిజన గ్రామాలకు రవాణా సౌకర్యాలు, ప్రభుత్వ పాఠశాలల్లో అదనపు తరగతి గదులు, ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్లలో నూతన భవనాలు, మౌలిక వసతుల కల్పనకు నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.

​అదేవిధంగా వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహను కలిసి నియోజకవర్గ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు పలు కీలక అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. మణుగూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని ప్రస్తుతం ఉన్న 100 పడకల నుండి 150 పడకలకు, గుండాల మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని (PHC) 30 పడకల ఆసుపత్రిగా స్థాయి పెంచాలని కోరారు.

వీటితో పాటు సారపాకలో నూతన పీహెచ్‌సీ మంజూరు, నియోజకవర్గంలోని పీహెచ్‌సీలలో డయాలసిస్ కేంద్రాల ఏర్పాటు, ఏరియా ఆసుపత్రి, సీహెచ్‌సీ, పీహెచ్‌సీలలో ఖాళీగా ఉన్న వైద్యులు, సిబ్బంది పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని విన్నవించారు. ఎమ్మెల్యే సమర్పించిన అన్ని ప్రతిపాదనల పట్ల మంత్రులు సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, దామోదర్ రాజనర్సింహ సానుకూలంగా స్పందించి, త్వరలోనే నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>