కలం, వెబ్‌డెస్క్: అమెరికాకు చెందిన ప్రముఖ టెక్నాలజీ కంపెనీ ఎన్విడియా (Nvidia) కొత్త సీఈవో నియామకం ఆసక్తికర మలుపు తీసుకుంది. ఇటీవల సీఈవో బాధ్యతల నుంచి తప్పుకున్న జెన్సన్ హువాంగ్ (Jensen Huang) మళ్లీ బాధ్యతలు చేపట్టనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఈ మేరకు బోర్డు సభ్యులు కూడా దీనికి ఆమోదం తెలిపినట్లు వెల్లడించింది. ఈ నిర్ణయం తీసుకునే ముందు అమెరికా ప్రభుత్వంలోని ఉన్నత స్థాయి అధికారుల నుంచి అభిప్రాయాలు తీసుకున్నట్లు బోర్డు వెల్లడించింది. అలాగే, జెన్సన్ హువాంగ్ వల్ల జాతీయ భద్రతకు ఎలాంటి ముప్పు లేదని తాము విశ్వసిస్తున్నట్లు తెలిపింది.
జెన్సన్ హువాంగ్‌తో వరుసగా చర్చలు, సమావేశాలు నిర్వహించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నామని కంపెనీ పేర్కొంది. ఆయన నిజాయితీ, నాయకత్వం వహించే సామర్థ్యంపై బోర్డు సంతృప్తి వ్యక్తం చేసిందని కంపెనీ తెలిపింది. అయితే కంపెనీ తాజా ప్రకటన బోర్డు గతంలో తీసుకున్న నిర్ణయానికి పూర్తి విరుద్ధంగా ఉంది. గత వారం జరిగిన ఎన్విడియా సమావేశంలో కొత్తగా నియమితులైన బోర్డు ఛైర్మన్ హార్వే జోన్స్ మాట్లాడుతూ.. హువాంగ్ స్వచ్ఛందంగా తన పదవికి రాజీనామా చేయడాన్ని బోర్డు ఏకగ్రీవంగా ఆమోదించిందని, ఆయనను తిరిగి నియమించే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు.
చైనా గూఢచారిగా అమెరికా భావిస్తున్న ఓ మహిళతో జెన్సన్ రిలేషన్‌షిప్ మెయింటైన్ చేస్తున్నట్లు తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలను జెన్సన్ కూడా అంగీకరించారు. ఆ తర్వాత ఆయనను తొలగించాలని ఒత్తిళ్లు రావడంతో నవంబర్ 12న ఆయన స్వచ్ఛందంగా రాజీనామా చేశారు. అయితే, తనకు మళ్లీ అవకాశం కల్పిస్తే తన బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తానని ఆయన స్పష్టం చేశారు. బోర్డు తాజా నిర్ణయంతో మళ్లీ జెన్సన్ తక్షణమే సీఈవోగా బాధ్యతలు చేపట్టనున్నారు.

