బిస్లెరి నీళ్లలో ప్రమాదకర రసాయనాలు.. కంపెనీ వివరణ ఇదే!

కలం, వెబ్ డెస్క్ :  బిస్లెరి కంపెనీల నీళ్లలో (Bisleri Water) క్యాన్సర్ కారకాలున్నట్లు FSSAI తేల్చడం తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. బిస్లెరి నీటిలో బ్రోమేట్, పాలీన్యూక్లియర్ అరోమాటిక్ హైడ్రోకార్బన్లు పరిమితికి మించి ఉన్నాయని.. ఆహార భద్రత చట్టం-2006 ప్రకారం ఈ నీళ్లు ఎంత మాత్రం సురక్షితం కాదని FSSAI హెచ్చరించిన వేళ బిస్లెరి సంస్థ తమ నీటి పరీక్షలపై వివరణ ఇచ్చింది.

తమ నీరు పూర్తిగా సురక్షితమేనని బిస్లెరి సంస్థ స్పష్టం చేసింది. 2025 సెప్టెంబర్ 30న గోవాలోని బిస్లెరి ప్లాంట్ నుంచి అధికారులు సేకరించిన ఆరు నీటి నమూనాల్లో ఐదు ప్రమాణాలకు అనుగుణంగా ఉండగా, ఒక నమూనాలో లీటరుకు 10 మైక్రోగ్రాముల పరిమితికి బదులుగా 12 మైక్రోగ్రాముల బ్రోమేట్ ఉన్నట్లు ప్రాథమిక పరీక్షల్లో వెల్లడించిందని తెలిపింది. 2025 నవంబర్ 22న అప్పీల్ చేయడంతో, ఆ నమూనాను రిఫరల్ ఫుడ్ లాబొరేటరీకి పంపినట్లు పేర్కొంది. అక్కడ బ్రోమేట్ స్థాయి పరిమితుల్లోనే ఉన్నట్లు తేలినప్పటికీ, పాలీన్యూక్లియర్ అరోమాటిక్ హైడ్రోకార్బన్లు ఉన్నట్లు నివేదిక రావడంతో పరీక్షా ఫలితాల మధ్య వ్యత్యాసంపై స్పష్టత కోరినట్లు వెల్లడించింది. ఆ తర్వాత FSSAI ఆమోదించిన మరో ప్రయోగశాలలో స్వతంత్రంగా పరీక్షలు చేయించగా బ్రోమేట్ స్థాయి నిబంధనల ప్రకారమే ఉందని తేలిందని, ఆ నివేదికలను 2026 ఫిబ్రవరి 2నే పశ్చిమ ప్రాంతీయ కార్యాలయానికి సమర్పించామని తెలిపింది.

అయితే, ఆ తర్వాత తమకు FSSAI నుంచి ఎలాంటి అధికారిక నోటీసు గానీ, సమాచారం గానీ అందలేదని కంపెనీ పేర్కొంది. ఇదిలాఉంటే తమ నీళ్లలో సమస్య రుజువైతే విచారణకు సిద్ధమని కంపెనీ ఛాలెంజ్ చేసింది. బిస్లెరిపై వస్తున్న నిందల్లో నిజం లేదని తేల్చి చెప్పింది. దేశవ్యాప్తంగా ఉన్న 143 తయారీ కేంద్రాలు, 6,000కు పైగా పంపిణీదారుల ద్వారా అందించే ప్రతి బ్యాచ్‌లోనూ 10 దశల నాణ్యత నియంత్రణతో పాటు 90కి పైగా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది. నియంత్రణ సంస్థల ప్రక్రియకు పూర్తిగా సహకరిస్తూనే, వినియోగదారులకు సురక్షితమైన తాగునీటిని అందించడంలో ఎలాంటి రాజీ పడబోమని బిస్లెరి సంస్థ వెల్లడించింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>