కలం, నకిరేకల్: హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై కేతేపల్లి (Kethepally) మండల శివారులో సోమవారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన వసంత ట్రాన్స్పోర్ట్కు చెందిన లారీ హైదరాబాద్ నుంచి నకిరేకల్ మీదుగా సూర్యాపేటకు వెళ్తుండగా, కేతేపల్లి శివారుకు చేరుకోగానే ఒక్కసారిగా వాహనంలో మంటలు చెలరేగాయి. గమనించిన వెనుక వాహన డ్రైవర్ వెంటనే అప్రమత్తం చేయడంతో, సదరు లారీ డ్రైవర్ వాహనాన్ని రోడ్డు పక్కకు నిలిపి కిందకు దిగడంతో పెను ప్రాణనష్టం తప్పింది.
అయితే, లారీలో వివిధ రకాల ఆయిల్ డబ్బాలు, రసాయనాలు, గ్యాస్‌కు సంబంధించిన సామగ్రి ఉన్నట్లు ప్రాథమికంగా సమాచారం. క్షణాల్లోనే మంటలు భారీగా ఎగిసిపడి వాహనం మొత్తం వ్యాపించాయి. సమాచారం అందుకున్న నకిరేకల్ అగ్నిమాపక శాఖ సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. అప్పటికే లారీ పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదానికి గల కచ్చితమైన కారణాలు, జరిగిన ఆస్తి నష్టం వివరాలు తెలియాల్సి ఉంది.

