కలం, స్పోర్ట్స్ : 2018 బాల్ టాంపరింగ్ వివాదం ఆస్ట్రేలియా క్రికెట్‌ను మరోసారి కుదిపేస్తోంది. అప్పటి ఘటనకు సంబంధించి ఇంకా అనేక ప్రశ్నలకు సమాధానాలు రావాల్సి ఉందని మాజీ క్రికెటర్ మాథ్యూ హేడెన్ (Matthew Hayden) అభిప్రాయపడ్డాడు. ఈ వ్యవహారంపై స్వతంత్ర, నిష్పక్షపాత విచారణ జరపాలని క్రికెట్ ఆస్ట్రేలియాను కోరాడు. ఇటీవల ఉస్మాన్ ఖవాజా, కామెరాన్ బాన్‌క్రాఫ్ట్ చేసిన వ్యాఖ్యలతో ఈ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. 2018లో దక్షిణాఫ్రికాతో కేప్‌టౌన్‌లో జరిగిన టెస్టు మ్యాచ్‌లో బాన్‌క్రాఫ్ట్ శాండ్‌పేపర్‌తో బంతిని మార్చేందుకు ప్రయత్నిస్తూ కెమెరాకు చిక్కాడు. దీంతో బాన్‌క్రాఫ్ట్‌తో పాటు అప్పటి కెప్టెన్ స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్‌పై నిషేధం విధించారు.
అయితే, ఈ ప్రణాళిక గురించి ఆ ముగ్గురికే కాకుండా జట్టులోని మరికొందరికి కూడా తెలుసని బాన్‌క్రాఫ్ట్ తాజాగా పేర్కొన్నాడు. బౌలింగ్ గ్రూపుతో రివర్స్ స్వింగ్‌పై చర్చలు జరిగినట్లు వెల్లడించాడు. ఈ సందర్భంగా పాట్ కమిన్స్ పేరును కూడా ప్రస్తావించాడు. ఉస్మాన్ ఖవాజా సైతం జట్టులో ఎంతమందికి ఈ విషయం తెలుసన్న ప్రశ్నలను లేవనెత్తాడు. అయితే, కమిన్స్ ఈ ఆరోపణలను ఖండించాడు. ఈ పరిణామాల నేపథ్యంలో అప్పటి ఆటగాళ్లు, ప్రస్తుతం జట్టులో ఉన్నవారు, రిటైర్ అయినవారు తమ వాదనలు వినిపించేలా పారదర్శక విచారణ జరగాలని హేడెన్ సూచించాడు. ఈ వివాదంపై స్పష్టత రాకపోతే ఆస్ట్రేలియా క్రికెట్‌పై ప్రజలకు ఉన్న నమ్మకం దెబ్బతింటుందని పేర్కొన్నాడు.

