కలం, మహబూబ్ నగర్ బ్యూరో: ప్రపంచ వారసత్వ వారోత్సవాల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర వారసత్వ శాఖ ఆధ్వర్యంలో శనివారం జడ్చర్ల మండలం అల్వన్ పల్లిలోని గొల్లత్తగుడి జైన ఇటుక దేవాలయాన్ని (Gollathagudi Jain Temple) విద్యార్థులు సందర్శించారు. సర్పంచి కె.ఎస్.దాస్ సహకారంతో అల్వాల్‌పల్లి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఈ సందర్శన ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా దేవాలయ చారిత్రక ప్రాముఖ్యత, ప్రాచీన ఇటుక నిర్మాణ శైలి, జైన మత వారసత్వ విశేషాలు, అక్కడి పురావస్తు అవశేషాల గురించి విద్యార్థులకు వివరించారు.
పిల్లలమర్రి మ్యూజియం సందర్శన..
పిల్లలమర్రి మ్యూజియంలో షాషాబ్ గుట్ట హైస్కూల్ విద్యార్థులకు ‘వారసత్వ కట్టడాలు – మన చారిత్రక సంపద’ అనే అంశంపై చిత్రలేఖన పోటీలు నిర్వహించారు. విద్యార్థులు తమ చిత్రాల ద్వారా చారిత్రక కట్టడాల ప్రాముఖ్యత, వారసత్వ సంపద పట్ల తమకున్న అభిరుచిని చాటుకున్నారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు సహాయ సంచాలకులు వి.నాగలక్ష్మి బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేశారు. మన పూర్వీకులు అందించిన అపురూపమైన చారిత్రక, సాంస్కృతిక వారసత్వ సంపదను పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆమె పేర్కొన్నారు. వారసత్వ కట్టడాల చరిత్ర, వాటి నిర్మాణ విశిష్టతను తెలుసుకోవడంతో పాటు వాటి పరిరక్షణ ఆవశ్యకతపై విద్యార్థులు చిన్ననాటి నుంచే అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు.

