కలం, నల్లగొండ : పట్టుదలతో చదివి, కఠినమైన ఎంపిక పరీక్షల్లో ప్రతిభ చాటిన మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం (ఎంజీయూ) ఇంజినీరింగ్ విద్యార్థులు (MGU Engineering Students) ప్రముఖ అమెరికా బహుళజాతి సంస్థలో కొలువులు సాధించారు. నల్గొండలోని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీలో ‘రీగల్ రెక్స్నార్డ్’ సంస్థ నిర్వహించిన ప్లేస్మెంట్ డ్రైవ్–2026లో ఆరుగురు విద్యార్థులు తుది ఎంపికలో సత్తా చాటారు. వీరికి ఏడాదికి రూ.8 లక్షల వార్షిక వేతన ప్యాకేజీతో పాటు, ఆరు నెలల ఇంటర్న్షిప్ కాలంలో నెలకు రూ.25 వేల చొప్పున స్టైపెండ్ లభించనుందని కళాశాల ప్రిన్సిపాల్, ప్లేస్మెంట్ సెల్ డైరెక్టర్ డాక్టర్ కె. హరీష్ కుమార్ వెల్లడించారు.
ఈ ప్రాంగణ నియామక ప్రక్రియలో మొత్తం 130 మంది విద్యార్థులు రాతపరీక్షకు హాజరయ్యారు. వారిలో ప్రతిభ కనబరిచిన 16 మంది టెక్నికల్, హెచ్ఆర్ రౌండ్లకు అర్హత సాధించగా, తుది దశలో ఆరుగురు విద్యార్థులు ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఎంపికైన వారిలో కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ (సీఎస్ఈ) విభాగం నుంచి ఎన్. మేఘమాల, సీహెచ్. మానస, జి. విష్ణు తేజ, జి. రాజేష్ ఉండగా.. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ (ఈఈఈ) విభాగం నుంచి కె. కార్తీక్, వి. మనీషా ఉన్నారు. ప్రముఖ బహుళజాతి సంస్థలో ఉద్యోగాలు సాధించిన విద్యార్థులను విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య ఖాజా అల్తాఫ్ హుస్సేన్, రిజిస్ట్రార్ ఆచార్య అంజి రెడ్డి, ప్రిన్సిపాల్ డాక్టర్ కె. హరీష్ కుమార్ ప్రత్యేకంగా అభినందించారు.
అంతర్జాతీయ సంస్థలో విద్యార్థులు కొలువులు దక్కించుకోవడం విశ్వవిద్యాలయానికి గర్వకారణమని వీసీ పేర్కొన్నారు. విద్యార్థుల కృషికి అధ్యాపకుల మార్గదర్శకత్వం, ప్లేస్మెంట్ సెల్ సమన్వయం తోడవడంతోనే ఈ విజయం సాధ్యమైందని, వీరి ప్రతిభ తోటి విద్యార్థులకు ఎంతో స్ఫూర్తిగా నిలుస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇంజినీరింగ్ ఫ్యాకల్టీ డీన్ ఆచార్య ఆర్. రేఖ, సీఎస్ఈ విభాగాధిపతి డాక్టర్ జయంతి, ఈసీఈ విభాగాధిపతి జి. మారేశ్వర రావు, ఈఈఈ విభాగాధిపతి నాగరాజు పాల్గొన్నారు.

