కలం, నిర్మల్ : ప్రభుత్వ బియ్యాన్ని అక్రమంగా విక్రయించి కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని కొల్లగొట్టిన ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్‌ను (Rekha Naik) వెంటనే అరెస్టు చేసి, బకాయిలను పూర్తిగా రికవరీ చేయాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. శనివారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని సీపీఎం జిల్లా కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో నాయకులు మాట్లాడుతూ.. రేఖా నాయక్‌కు చెందిన రైస్ మిల్లులో సుమారు రూ.12 కోట్ల విలువైన ప్రభుత్వ బియ్యం అక్రమంగా విక్రయించినట్లు ఆరోపణలు ఉన్నాయని పేర్కొన్నారు.
గతంలో ఎమ్మెల్యేగా కొనసాగిన సమయంలోనే రైతుల నుంచి అదనపు తూకం పేరుతో దోపిడీకి పాల్పడినందుకు తాము ఆందోళనలు నిర్వహించిన విషయాన్ని గుర్తు చేశారు. రాజకీయ పలుకుబడితో చర్యల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కడెంపెద్దూరు రైస్ మిల్లుకు చెందిన గుండ ప్రసాద్ రూ.14 కోట్ల విలువైన బియ్యం అక్రమాలకు పాల్పడిన కేసులో అరెస్టయి జైలుకు వెళ్లగా, రేఖా నాయక్ విషయంలో మాత్రం అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. అధికార పార్టీలో ఉన్నవారికి ఒక న్యాయం, ఇతరులకు మరో న్యాయమా అని నిలదీశారు.
గ్రామాల్లో రేషన్ బియ్యం కొనుగోలు చేసే సామాన్యులను పట్టుకొని కేసులు నమోదు చేస్తున్న అధికారులు, వేలాది టన్నుల ప్రభుత్వ బియ్యాన్ని ఇతర రాష్ట్రాలకు తరలించి విక్రయిస్తున్న మిల్లర్లపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేసిన ఏ ఒక్క రైస్ మిల్లర్‌ను వదలకుండా కేసులు నమోదు చేయాలని, అక్రమంగా విక్రయించిన బియ్యం పూర్తిగా రికవరీ చేసి బాధ్యులను జైలుకు పంపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు దుర్గం నూతన్ కుమార్, రైతు సంఘం జిల్లా కార్యదర్శి నర్సయ్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు డాకూర్ తిరుపతి, జిల్లా ఉపాధ్యక్షుడు బర్కుంట గంగారం, గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి తొడసం శంభు తదితరులు పాల్గొన్నారు.

