కలం, నిజామాబాద్ బ్యూరో : తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం కాస్త ఎక్కువైందని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) వ్యాఖ్యానించారు. నిజామాబాద్ పర్యటనలో భాగంగా మీడియాతో మాట్లాడిన ఆయన, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యంగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు, అలాగే అభివృద్ధి పనుల బిల్లులు, అధికారుల కమీషన్ల అంశంపై జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి చేసిన బహిరంగ విమర్శలపై స్పందించారు. ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు ఏ సందర్భంలో ఏం మాట్లాడారనే పూర్తి వివరాలను, వీడియోలను అధిష్టానానికి నివేదించామని, ఈ వ్యవహారంపై ఏఐసీసీ నిశితంగా పరిశీలన చేస్తోందని స్పష్టం చేశారు. పార్టీ లైన్ దాటి బహిరంగ వేదికలపై మాట్లాడే వారి విషయంలో క్రమశిక్షణ చర్యల అంశంపై అధిష్టానమే తుది నిర్ణయం తీసుకుంటుందన్నారు. మాజీ మంత్రి కొండా సురేఖ విషయంలో మొదటి సారి చర్యలు తీసుకోలేదని, రెండు మూడు సార్లు పరిశీలించి ఏఐసీసీ చర్యలు తీసుకుందని గుర్తు చేశారు.

