చిన్న ఏనుగుకు పెద్ద క‌ష్టం.. విమానంలో త‌ర‌లించి చికిత్స‌

క‌లం, వెబ్‌డెస్క్‌: అనారోగ్యానికి గురైన ఓ గున్న ఏనుగుకు అనంత్ అంబానీ చొర‌వ‌తో మెరుగైన వైద్యం అందుతోంది. అస్సాంలో ఉన్న ఈ ఏనుగును ప్ర‌త్యేక విమానంలో చికిత్స కోసం వంతారా (Vantara)కు త‌ర‌లించారు. అస్సాంలోని గౌహ‌తిలో అక్టోబ‌ర్ 2న ఓ పిల్ల ఏనుగు జ‌న్మించింది. ఈ ఏనుగుకు రాజా (Elephant Raja) అని య‌జ‌మాని పేరు పెట్టారు. ఇది పుట్టిన కొద్ది రోజుల‌కే వెనుక కాలు విరిగిపోయింది. దీంతో పాటు ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌లు ఎదుర‌వుతున్నాయి. దీంతో యజమాని త‌న ఇంట్లోనే ఈ ఏనుగుకు చికిత్స అందించారు. ఈ విష‌యం అనంత్ అంబానీ దృష్టికి రావ‌డంతో ఆయ‌న ఏనుగుకు ట్రీట్‌మెంట్ అందించేందుకు చొర‌వ తీసుకున్నారు. అక్టోబర్ 8 నుండి వంతారా మెడిక‌ల్‌ టీమ్ అస్సాంలో ఈ పిల్ల ఏనుగుకు చికిత్స చేస్తోంది.

ఈ ఏడు వారాల ఏనుగు పిల్లను అత్యవసర చికిత్స కోసం తాజాగా అస్సాం నుండి గుజరాత్‌కు విమానంలో తరలించారు. రిలయన్స్ ఆధ్వర్యంలో జామ్‌నగర్‌లో నడుస్తున్న వంతారా ప్రత్యేక ఏనుగుల ఆసుపత్రిలో దీనికి చికిత్స అందించనున్నట్లు వంతారా వెల్ల‌డించింది. అస్సాం నుంచి వంతారాకు 2,500 కిలోమీటర్లకు పైగా దూరం ఉంటుంది. ఇంత పెద్ద రోడ్డు మార్గంలో ఏనుగు పిల్ల‌ ప్ర‌యాణించ‌డం చాలా ప్రమాదకరమని పశువైద్యులు భావించారు. అందుకే అనంత్ అంబానీ (Anant Ambani) గౌహతి నుండి నాలుగు గంటల పాటు సాగే ఈ ఫ్లైట్ జ‌ర్నీని ఏర్పాటు చేశారు. అంబానీ సహకారంతో ఇండియాలో ఒక ఏనుగును ఇలా విమానంలో తరలించడం ఇది మూడోసారి అని వంతారా వెల్ల‌డించింది. ప్రత్యేకంగా రూపొందించిన బోనులో ఏనుగును త‌ర‌లించారు. ఏనుగుతో పాటు విమానంలో పశువైద్యులు, పారావెట్స్, సంరక్షకులు కూడా త‌ర‌లివెళ్లారు.

ఈ ఏనుగు పిల్ల‌ (Elephant Raja) పుట్టిన రోజే దాని తల్లి తన్నడంతో కుడి తొడ ఎముక పూర్తిగా విరిగిపోయింది. కాళ్లపై నిలబడలేక, బరువు మోయలేక అప్పుడే పుట్టిన ఏనుగు పిల్లలకు రోగనిరోధక శక్తిని, పోషణను అందించే తల్లి ముర్రుపాలు, సాధారణ పాలు అందకుండా పోయాయి. ఈ ఏనుగు యజమాని ప్రత్యేక వైద్య సహాయం కోరడంతో వంతారా ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ అక్క‌డికి చేరుకుంది.అది నిలబడటానికి ఒక పట్టీని ఉపయోగించడంతో పాటు, ప్రత్యేకంగా తయారు చేసిన పాలను ఆహారంగా అందించడం ప్రారంభించారు. వంతారా ఆసుపత్రికి చేరుకున్నాక ఈ ఏనుగుకు మరిన్ని వైద్య పరీక్షలు, ఆర్థోపెడిక్ చికిత్స, పోషకాహారం కల్పించనున్నారు. ఈ ఏనుగుకు జీవితాంతం పశువైద్యుల సంరక్షణ, పర్యవేక్షణ అవసరమయ్యే అవకాశం ఉందని వంతారా వెల్ల‌డించింది.

Also Read : ఇందిరమ్మ బీమాకు మార్గదర్శకాలు విడుదల

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>