మహబూబ్ నగర్‌లో ఖేలో ఇండియా యూత్ గేమ్స్.. ఏర్పాట్లపై యెన్నం సమీక్ష!

కలం, మహబూబ్ నగర్ బ్యూరో: ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌ (Khelo India Youth Games) లో భాగంగా మహబూబ్‌నగర్ జిల్లా ఇండోర్ స్టేడియంలో డిసెంబర్ 17 నుంచి 22వ తేదీ వరకు నిర్వహించనున్న జాతీయ స్థాయి కబడ్డీ పోటీలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని ప్రభుత్వ విప్, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ పోటీల నిర్వహణకు సంబంధించి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు మహబూబ్‌నగర్ ఆతిథ్యం ఇవ్వడం జిల్లాకు దక్కిన గౌరవంగా భావించాలని అన్నారు. పోటీల నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా ఆహ్వానించి, ఖేలో ఇండియా క్రీడలకు మరింత ప్రాధాన్యత తీసుకువచ్చేలా ప్రత్యేక చర్యలు చేపడతామని తెలిపారు. జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు మహబూబ్‌నగర్ వేదిక కావడం గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారులకు గొప్ప అవకాశమని, ఈ విషయాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలని ఆయన సూచించారు. క్రీడల నిర్వహణలో ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

ఈ పోటీల్లో మొత్తం 16 జట్లు పాల్గొంటాయని, వీటిలో 8 బాలికల జట్లు, 8 బాలుర జట్లు ఉంటాయని వివరించారు. క్రీడాకారులకు వసతి, భద్రత, రవాణా, భోజన సౌకర్యాల కల్పనలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. జాతీయ స్థాయి క్రీడా పోటీలను విజయవంతంగా నిర్వహించి మహబూబ్‌నగర్ జిల్లాకు మంచి గుర్తింపు తీసుకురావాలని ఎమ్మెల్యే అధికారులకు సూచించారు. అనంతరం ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌ పోస్టర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నగర డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి, శిక్షణ కలెక్టర్ సాయి శివాని, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షులు ఎన్ పి వెంకటేష్, డీఆర్ఓ ఎ.నిర్మల, డీఎస్పీ వెంకటేశ్వర్లు , డీవైఎస్ఓ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>