మణుగూరులో హైడ్రామా.. ఐదుగురు ట్యాంక్‌పైకి ఎక్కి నిరసన!

​కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు(Manuguru) పట్టణంలోని గాంధీ బొమ్మ సెంటర్ వద్ద శనివారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. భూ వివాదంలో తనకు రావాల్సిన డబ్బులు ఇవ్వకుండా మోసం చేశారంటూ సురేష్ అనే వ్యక్తి, మరో నలుగురితో కలిసి మున్సిపల్ వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసనకు దిగడంతో అక్కడ కొద్దిసేపు హైడ్రామా చోటుచేసుకుంది. నడిరోడ్డులోని వాటర్ ట్యాంక్‌పైకి ఐదుగురు వ్యక్తులు ఎక్కడంతో స్థానికులు, వాహనదారులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.

ఏం జరుగుతుందో తెలియక పెద్ద ఎత్తున జనం అక్కడ గుమిగూడటంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. విషయం తెలుసుకున్న మణుగూరు పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. మణుగూరు మండలం తోగూడెం గ్రామానికి చెందిన మలిగిరెడ్డి గోపాల్ రెడ్డి తనకు రూ. 2 లక్షలు చెల్లించాల్సి ఉందని బాధితుడు సురేష్ ట్యాంక్ పైనుంచే ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ఇవ్వాల్సిన డబ్బులు ఎగ్గొట్టి, సదరు భూమిని మరొకరికి విక్రయించి గోపాల్ రెడ్డి తనను దారుణంగా మోసం చేశారని ఆరోపించారు.

తనకు న్యాయం జరిగే వరకు కిందికి దిగేది లేదని సురేష్ బృందం భీష్మించుకుని కూర్చుంది. పరిస్థితి చేయిదాటకుండా పోలీసులు మైక్ ద్వారా నిరసనకారులతో చర్చలు జరిపారు. ప్రాణాలకు ముప్పు తెచ్చుకోవద్దని, వివాదంపై సమగ్ర విచారణ జరిపి చట్టప్రకారం న్యాయం చేస్తామని పోలీసులు వారికి స్పష్టమైన హామీ ఇచ్చారు. పోలీసుల మాటలతో శాంతించిన సురేష్, మరో నలుగురు క్షేమంగా కిందికి దిగి రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం పోలీసులు వారిని స్టేషన్‌కు తరలించి, భూ వివాదానికి సంబంధించిన పూర్తి వివరాలను సేకరించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>